
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆరోగ్యరీత్యా ఆమె ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. దీంతో సోనియా పెద్దల సభకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభకు (Rajya Sabha) జైపూర్‌లో నామినేషన్ వేశారు. ఈ సీటు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయం.
ఇకపోతే నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్‌లో (Poll Affidavit) ఆస్తుల వివరాలను సమర్పించారు. సోనియా గాంధీ (Sonia Gandhi) చర, స్థిర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.12,53,76,822గా ఉంది.
2014లో ఆమె సంపద విలువ రూ.9.28 కోట్లుగా ఉండగా.. 2019లో ఆ మొత్తం రూ.11.82 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఆమె దగ్గర రూ.కోటి విలువైన ఆభరణాలే ఉన్నట్లు పేర్కొన్నారు. వాటితో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చే రాయల్టీ, పెట్టుబడులు, బ్యాంకు డిపాజిట్లు, బాండ్ల ద్వారా ఆమె చర ఆస్తులు రూ.6.38 కోట్లుగా ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే వడ్డీ, ఎంపీ జీతమే తన ఆదాయమని పేర్కొన్నారు.
ఇక తన స్వదేశమైన ఇటలీలో తనకు వారసత్వంగా వచ్చిన నివాసం గురించి ప్రస్తావించారు. 2014లో ఆ ఇంటి విలువ రూ.19.9 లక్షలుగా ఉందని.. అది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.26.83 లక్షలు పలుకుతోందని తెలిపారు.
ఇక వ్యక్తిగతంగా తనకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవని అఫిడవిట్‌లో సోనియా వెల్లడించారు. ఇంతవరకు ఏ క్రిమినల్ కేసులోనూ దోషిగా తేలలేదని పేర్కొన్నారు. అలాగే తన విద్యార్హతలను ప్రస్తావించారు. 1964లో విదేశీ భాషల్లో మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసినట్ల తెలిపారు. 1965లో ఇంగ్లిష్‌లో సర్టిఫికేట్ కోర్సు చేశారు.
ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ జారీచేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఆయా స్థానాలు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి.