Leading News Portal in Telugu

PM Modi: రాముడు లేడన్న వాళ్లు, ఇప్పుడు “జై సియారం” అంటున్నారు..



Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. అయోధ్య రామమందిరంపై ఆ పార్టీ వైఖరిని ఉద్దేశిస్తూ ఈ రోజు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రాముడి ఉనికి ఊహాత్మకం అని, ఆలయాన్ని నిర్మించొద్దనే వారని, కాని ఇప్పుడు వారే ‘జై సియారం’ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. హర్యానాలోని రేవారిలో ఎయిమ్స్‌కి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోడీ, అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం ప్రపంచంలో మంచి గుర్తింపు పొందిందని, ఇది ప్రజల వల్లే సాధ్యమైందని ఆయన అన్నారు.

Read Also: CM Revanth Reddy: తెలంగాణ పోలీసులను, డీజీపీ రవిగుప్తాను అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఈ వారం జరిగిన యూఏఈ, ఖతార్ పర్యటనను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతీ మూలలో గౌరవం లభిస్తోందని, ఇది ఒక్క నరేంద్రమోడీకే కానది యావత్ దేశానికి గౌరవం లభిస్తోందని ఆయన అన్నారు. గతంలో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసి హామీ ఇచ్చామని, దానిని నెరవేర్చామన్నారు. దేశ ప్రయోజనాల కన్నా కాంగ్రెస్ పార్టీకి ఒక్క కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ అని ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాలు చేసిందని దుయ్యబట్టారు.

2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి కార్యక్రమం రేవారిలోనే జరిగిందని ఆయన గుర్తు చేశారు. అయోధ్య హామీని నెరవేర్చామని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఈ సారి 400కు పైగా సీట్లను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో సీట్లు ముఖ్యమని, తనకు మాత్రమ ప్రజల దీవనలే పెద్ద ఆస్తి అని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిందని అన్నారు. గత 10 ఏళ్లలో భారత్ 11వ ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందని అన్నారు. రాబోయే మూడో టర్మ్‌లో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారతుందని మోడీ హామీ ఇచ్చారు.