posted on Feb 17, 2024 11:29AM
విజయవాడ – ఖమ్మం మార్గంలో చింతకాని మండలం పాతర్లపాడు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదం ఈ ఉదయం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు 113వ గేటు సమీపంలోకి వచ్చిన వెంటనే భారీ శబ్దాలు వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్ గూడ్స్ రైలును ఆపేశారు. రెండు బోగీలు పూర్తిగా రైల్వే ట్రాక్ నుంచి పక్కకు జరిగాయి. ప్రమాదం కారణంగా కాజీపేట నుంచి విజయవాడకు వెళ్లే పలు రైళ్లను ఆపేశారు. ప్రమాదం జరిగిన చోట తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. సాంకేతిక లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఒక కిలోమీటర్ మేర రైలు కట్టకు అనుసంధానంగా ఉన్న స్వీపర్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పునరుద్ధరణ పనులను రైల్వే అధికారులు హుటాహుటిన చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు మరమ్మతులకు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పట్టాలు తప్పింది గూడ్స్ రైలు కావడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేసి, రాకపోకలను పునరుద్ధరించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్‌ను త్వరగా పునరుద్ధరించాలని కోరుతున్నారు.