గుంటూరు లోక్ సభ అభ్యర్థి వేటలో జగన్!.. పోటీకి నో అంటున్న ఉమ్మారెడ్డి? | ummareddy venkataramana handsup| reject| contest| guntur| loksabha| demand| guntur2| assembly| jagan
posted on Feb 17, 2024 12:15PM
వైసీపీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు కరవైయ్యారు. అధిష్ఠానం ఏరి కోరి ఎంపిక చేసిన వారు చేతులెత్తేస్తున్నారు. తమ స్థానాన్ని మార్చిన జగన్ తీరుపై అసంతృప్తిగా ఉన్న వారు పార్టీ మారిపోతున్నారు. మొత్తంగా వైసీపీలో ఇప్పుడు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. సిట్టింగుల మార్పు అంటూ జగన్ ఎప్పుడైతే మార్పులకు శ్రీకారం చుట్టారో ఆ క్షణం నుంచీ వైసీపీలో ముసలం ప్రారంభమైందంటున్నారు. ప్రజా వ్యతిరేకత ఉందని తెలిసినా, నియోజకవర్గంలో ఉంటూ పని చేసుకున్న తమకు విజయం లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పుడు తమ స్థానానికే జగన్ ఎసరు పెట్టడంతో ఒక్క సారిగా తిరుగుబావుటా ఎగుర వేస్తున్నారు. మీకో దణ్ణం, మీ పార్టీకో దణ్ణం అంటూ జెండా పీకేస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు వెనుకాడటం లేదు. తాము చేరబోయే పార్టీలో టికెట్ రాదని తెలిసినా, కనీసం రాజకీయంగా లైఫ్ ఉంటుందన్న భావనతో మరో ఆలోచన లేకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోతున్నారు.
టికెట్ల విషయంలో అసంతృప్తికి గురైన వారి పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్ దక్కిన వారూ సంతృప్తిగా లేరు. నాన్ లోకల్ అన్న ముద్ర వేసుకుని, వారికి టికెట్ లభించిన నియోజకవర్గంలో సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించి గౌరవంగా పోటీ నుంచి తప్పుకుంటే బెటరన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు. తాజాగా గుంటూరు వైసీపీ లోక్ సభ అభ్యర్థి ఉమ్మారెడ్డి వెంకటరమణ తాను లోక్ సభ బరిలో దిగేది లేదని భీష్మించారు. తాను లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టేయడంతో ఇప్పుడు కీలకమైన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి లేక జగన్ తల పట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎంత వెతికినా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయడానికి అభ్యర్థి దొరకని దయనీయ స్థితిలో అధికార పార్టీ ఉంది. సాధారణంగా ఎన్నికల ముందు అధికార పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు పోటీలు పడతారు. అందుకు భిన్నంగా వైసీపీలో పోటీ నుంచి నేతలు పారిపోతున్న పరిస్థితి ఉండటమే.. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీ ఎటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుందో తేటతెల్లం చేస్తున్నది.
ఎన్నో కసరత్తుల చేసి, కుల సమీకరణాలు, ఆర్థిక బలం .. ఇలా అన్ని పరిగణనలోనికి తీసుకుని గుంటూరు లోక్ సభ స్థానానికి ఉమ్మారెడ్డి వెంకటరమణను జగన్ ఎంపిక చేశారు. ఉమ్మారెడ్డి వెంకటరమణ మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు. ఉమ్మారెడ్డి వెంకటరమణను గుంటూరు లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా ప్రకటించినా, ఆయన మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లోనూ లోక్ సభకు పోటీ చేసేది లేదని భీష్మించి, తాను అసెంబ్లీ బరిలోనే దిగుతానని కుండబద్దలు కొట్టేశారు. ఇది జగన్ ను ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో పడేసిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అయినా అత్యంత కీలకమైన గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీలోకి దింపడానికి వైసీపీకి అభ్యర్థే దొరకని పరిస్థితి ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఉమ్మారెడ్డి వెంకటరమణ తాను గుంటూరు 2 నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయనకు ఆ స్థానం ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యే విడదల రజనీని అక్కడ నుంచి మార్చి గుంటూరు 2కు అభ్యర్థిగా జగన్ ఇప్పటికే ప్రకటించేశారు. అసలు వైసీపీ నుంచి పోటీ చేయడానికి ఇష్టం లేకనే ఉమ్మారెడ్డి వెంకటరమణ గుంటూరు 2 అసెంబ్లీ స్థానం కోరుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కూడా కారణం లేకపోలేదని చెబుతున్నారు. పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు స్వయాన అల్లుడు అయిన కిలారి రోశయ్యకు జగన్ మొండి చేయి చూపించేందుకు రెడీ అయిపోయారనీ, ఆయనకు పొన్నూరు నుంచి పోటీకి నో చెప్పారనీ, అందుకే ఉమ్మారెడ్డి కుటుంబం కినుక వహించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అసలు సిట్టింగుల మార్పు అంటూ జగన్ జాబితాలు విడుదల చేయడం మొదలు పెట్టిన నాటి నుంచే పార్టీలో అసమ్మతి భగ్గు మంది. జగన్ తన క్యాబినెట్ ను రీషఫుల్ చేసిన సందర్భంగానే పెద్ద ఎత్తున అసమ్మతి చెలరేగినప్పటికీ, అప్పటికి ఇంకా రెండేళ్లు అధికారంలో జగన్ కొనసాగుతారు కనుక భగ్గుమని చెలరేగిన అసమ్మతి చప్పగా చల్లారిపోయింది. అయితే ఇక ఇప్పుడు మాత్రం పార్టీలో అసమ్మతి చల్లారే పరిస్థితి కనిపించడం లేదు. నెలల వ్యవధిలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే పొలిటికల్ ప్యూచరే ప్రమాదంలో పడుతుందని వైసీపీ అసమ్మతి నేతలు తగ్గేదే లేదంటున్నారు.