ఢిల్లీ ఏపీ భవన్లో ఎవరి వాటా ఎంత? షెడ్యూల్ 9,10 పంచాయితీ తేలేదెప్పుడు? | assets distribution between ap and telangana| bifugation| act| schedule| 9
posted on Feb 17, 2024 1:31PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల విభజన పూర్తి కాలేదు. ఏపీ 17 వేల కోట్ల బాకీ వుందని తెలంగాణా ప్రభుత్వం చెబుతుంటే, 6 వేల కోట్ల బకాయి తెలంగాణా నుంచి రావాల్సి వుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ, తెలంగాణ ఆస్తుల వ్యవహారం కొలిక్కి రాలేదు. ఇప్పుడు ఏపీ ఎన్నికల వేళ రెండు రాష్ట్రాల ఆస్తుల పంపిణీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆస్తుల పంపకాల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అంగీకారం తెలపడంతో మార్గం సుగమమమైంది. దీంతో ఢిల్లీ లో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా ఆస్తుల పంపిణీ కున్న అడ్జంకులు దాదాపుగా తొలగిపోయాయనే చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు దేశ రాజధాని ఢిల్లీలో ఏపీ భవన్ సహా భూములు, భవనాలు దాదాపు రూ 10 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇందులో గోదావరి బ్లాక్, శబరి బ్లాక్, నర్శింగ్ హాస్టల్, పటౌడీ హౌస్ వంటివి ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి వెలుపల ఉండే ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచారు. ఫలితంగా పదేళ్లుగా సాగుతున్న ఆస్తుల పంపకం వ్యవహారం ఇప్పుడు కొలిక్కివచ్చింది.
ఆస్థుల పంపకం ఇలా..
మొత్తం 19.781 ఎకరాల్లో ఉన్న ఏపీ భవన్ ఆస్తుల్లో ..
ఆంధ్రప్రదేశ్‌కు 11,356 ఎకరాలు, తెలంగాణకు 8,245 ఎకరాలు కేటాయింపునకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. ఏపీ భవన్ పరిధిలో ఉన్న గోదావరి బ్లాక్‌లోని 4.315 ఎకరాలు, శబరి బ్లాక్‌లోని ఇన్నర్ రోడ్స్, ఆక్రమణకు గురైన ప్రాంతంలోని దుకాణాలున్న 0.512 ఎకరం, నర్శింగ్ హాస్టల్ ఉన్న 3.359 ఎకరాలు, పటౌడీ హౌస్‌లోని 2.396 ఎకరాలు ఏపీకు కేటాయించేలా ప్రతిపాదన జరిగింది. ఇక శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడీ హౌస్‌లోని 5.245 ఎకరాలు తెలంగాణకు కేటాయించేలా ప్రతిపాదించారు.
ఏపీకు కేటాయించిన ఆక్రమణలు ఉన్న ప్రాంతాన్ని స్వాధినం చేసుకోలేని పక్షంలో అందుకు సమానమైన భూమిని శబరి బ్లాక్ లేడా పటౌడీ హౌస్ భూమి నుంచి కేటాయించాలనేది ఏపీ విధించిన కండిషన్. ఈ ప్రతిపాదనలపై రెండు రాష్ట్రాలు అంగీకరించాయని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాల ప్రతిపాదన, స్పందనల్ని ఆయా రాష్ట్రాలకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ 9లో వున్న ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన, షెడ్యూల్ 10లో వున్న రాష్ట్ర స్థాయి సంస్థల విభజన, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఏ పీ హెవీ మిషనరీ యింజనీరింగ్ లిమిటెడ్ విభజన, నగదు, బ్యాంకు బ్యాలెన్సుల విభజన, తెలంగాణా పౌర సరఫరాల కార్పొరేష న్ నుంచి ఏపీ పౌర సరఫరాలకు రావాలసిన క్యాష్ క్రెడిట్ బకాయిలు, విద్యుత్ బకాయిల అంశంమొదలైన సమస్యల పరిష్కరించాల్సి వుంది.
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్, హైకోర్టు భవనం, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి భవనాలను వినియోగించుకున్నందున ఆ రాష్ట్రం నుంచి వడ్డీతో కలిపి మొత్తం రూ.408 కోట్లు కావాలని తెలంగాణా అడుగుతోంది. ఇలా లెక్కేసుకుంటూ పోతే టోటల్‌గా ఏపీ 17 వేల కోట్ల బాకీ వుందని తెలంగాణా ప్రభుత్వం చెబుతోంది.
మరో వైపు విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణా నుంచి ఏపీకి 6 వేల కోట్ల రూపాయలు రావాలని ఏపీ అంటోంది. రాష్ట్ర పునర్విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని, పదో షెడ్యూల్ పరిధిలోని సంస్థల వివాదాన్ని పరిష్కరించాలని, న్యూఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను సాఫీగా పూర్తి చేయాలని, చట్టంలో ఎక్కడా పేర్కొనకుండా ఉన్న సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకోవడంపై దృష్టిసారించాలని కేంద్ర హోం శాఖ మంత్రికి ఏపీ ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.