Leading News Portal in Telugu

Farmers protest: రైతుల నిరసన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం..ఎంఎస్‌పీపై ప్యానెల్ ఏర్పాటు.!



Fermers Protest

Farmers protest: పంటలకు మద్దతుధర(ఎంఎస్‌పీ)తో సహా 12 హమీలను అమలు చేయాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు రైతులు ఆందోళన చేపట్టారు. ‘ఢిల్లీ ఛలో’పేరుతో మార్చ్ నిర్వహించారు. అయితే, వీరిని హర్యానా-ఢిల్లీ సరిహద్దుల్లోనే పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. మరోవైపు రైతులతో కేంద్ర మంత్రులు పలుమార్లు చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది.

Read Also: Arvind Kejriwal: 2024లో బీజేపీ గెలిచినా.. 2029లో ఆ పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేస్తాం..

చర్చల కోసం రైతు సంఘాల ప్రతినిదుల పేర్లను కూడా కమిటీ కొరే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. రైతుల డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ రంగంలో పని చేస్తున్న ఇతర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలతో సహా వాటాదారులతో చర్చలు అవసరమని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ప్రస్తుతం పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు మరియు ఖనౌరీ పాయింట్ల వద్ద రైతులు నిరసన తెలుపుతున్నారు. అక్కడే క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. కీలక డిమాండ్ అయిన ఎంఎస్‌పికి చట్టపరమైన హామీ ఇవ్వడంపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావాలని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ శనివారం డిమాండ్ చేశారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో మూడుసార్లు చర్చించారు. ఆదివారం నాలుగో విడత చర్చించనున్నారు.