posted on Feb 17, 2024 12:11PM
దగా డీఎస్సీ వద్దు – మెగా డీఎస్సీ కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. నాడు మెగా డీఎస్సీ అంటూ హామీ ఇచ్చిన జగన్ ఎన్నికల ముందు దగా డిఎస్సి ఇచ్చారని మండిపట్టారు. నిరుద్యోగులను నిలువునా ముంచిన వైసీపీ సర్కార్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ‘మాకూ ఉంది ఓటు’ – ‘మీకూ ఉంది వేటు’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మెగా డీఎస్సీ వేయాలంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా నేడు నంద్యాల జిల్లా డోన్‌లో ఇదే డిమాండ్‌తో ఎన్ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రికి వినతిపత్రం అందించేందుకు ఎన్ఎస్‌యూఐ నేతలు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పట్టుకునే ప్రయత్నంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కిందపడ్డారు. అనంతరం నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నిన్న కూడా ఇదే డిమాండ్‌తో యూత్ కాంగ్రెస్ నేతలు మంత్రి అంబటి రాంబాబు ఇంటి ముట్టడికి యత్నించారు. సత్తెనపల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్న నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఐదేళ్లుగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను ఊరిస్తున్న ప్రభుత్వం చివరకు ఆరు వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. దీనికి నిరసనగా ‘దగా డీఎస్సీ వద్దు – మెగా డీఎస్సీ’ కావాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. నెల రోజుల్లో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.