Leading News Portal in Telugu

జగన్ పార్టీకి ఎండ్ కార్డ్ ?.. ఏడో జాబితాతో విజయంపై వైసీపీ శ్రేణుల్లోనూ సడలిన విశ్వాసం! | ycp sittings change 7th list| jagan| searching| candidates| contest| party| cadre| loose| confidence


posted on Feb 17, 2024 11:13AM

ఇప్పటి వరకూ ప్రతిపక్షం తెలుగుదేశం వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వైసీపీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందంటూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం చేస్తున్న వ్యాఖ్యలను, వేస్తున్న సెటైర్లను  పెద్దగా ఎవరూ నమ్మలేదు. అధికారపార్టీపై ప్రజా వ్యతిరేకత ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ పార్టీకి అభ్యర్థులే దొరకనంతగా బలహీనపడిందంటే నమ్మకం కలగడం లేదనే అంటున్నారు. అయితే ఆ పార్టీ తాజాగా విడుదల చేసిన ఏడో జాబితా చూసిన తరువాత ఇక వైసీపీ అభ్యర్థుల కోసం వెతుకులాటలో పడిందన్నది దాదాపుగా అందరికీ నిర్ధారణ అయిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అవును జగన్ రెడ్డి సిట్టింగుల మార్పుల ఏడో జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో రెండంటే రెండు పేర్లే ఉన్నాయి. ఆ రెండు నియోజకవర్గాలకూ కొత్త సమన్వయకర్తలను నియమించారు. ఆ రెండు పేర్లలో ఒకటి ఎడం బాలాజీ. ఆయనను పర్చూరుకు సమన్వయకర్తగా నియమించారు.

యడం బాలాజీ  ఇప్పటికీ తెలుగుదేశంలోనే ఉన్నారు. పార్టీకి రాజీనామా ఇంకా చేయలేదు. అయితే చాలా కాలంగా ఆయన పార్టీకే కాదు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు. పైగా ఇక్కడ కాదు అమెరికాలో ఉంటున్నారు.  మరి అలాంటి ఎడం బాలాజీని పర్చూరు సమన్వయ కర్తగా నియమించిందంటే.. పర్చూరులో ఆమంచి పోటీకి ససేమిరా అనడం,   ఇండిపెండెంట్ అయినా సరే  చీరాల నుంచి రంగంలోకి  దిగుతారన్న భావనలో ఉన్న జగన్ ఆయనను తప్పించాలని నిర్ణయించేసుకున్నారు. అయితే ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంలో మాత్రం పార్టీకి సంబంధించి ఎవరూ దొరకకపోవడంతో  ఎడం బాలాజీని  పిలిపించుకున్నారు. ఆయన తనను కలిసినట్లుగా ఓ ఫొటో విడుదల చేసి పర్చూరు సమన్వయ కర్తగా ప్రకటించేశారు. ఆయన అమెరికా వదిలి ఇక్కడకు వస్తారా? వచ్చి పోటీ చేస్తారా? అన్న విషయాలపై ఇప్పుడు క్లారిటీ రావాల్సి ఉంది. పర్యూరు విషయం ఇలా ఉంటే.. కందుకూరుది మరో కథ. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీందర్ రెడ్డికి  టికెట్ ఇవ్వొద్దని డిసైడైపోకయిన జగన్ ఇక్కడ కూడా సొంత పార్టీ వారెవరూ దొరకక, వేరే నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం నేత పెంచలయ్య కుమార్తెను ఇన్ చార్జిగా నియమించేశారు. ఈ ఏడో జాబితా పరిశీలకులనే కాదు, వైసీపీ నేతలను, శ్రేణులనూ కూడా విస్మయపరిచిందనడంలో సందేహం లేదు.  పెంచలయ్య తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరి నిండా నెలరోజులు కూడా కాలేదు.  ఇంతకీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిపై జగన్ ఆగ్రహానికీ, ఆయన ను తప్పించడానికీ కారణాల కోసం పెద్దగా  ఆరా తీయాల్సిన అవసరం లేదు. ఆయన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను బూతులు తిట్టడానికి సుముఖంగా లేకపోవడమే జగన్ కోపానికి కారణం.   

ప్రతిపక్ష నేతలను తిట్టడమే టికెట్ లభించడానికి ట్రేడ్ మార్క్ అని భావిస్తున్న జగన్   అలా తిట్టడానికి ఇష్టపడని వారందరినీ పక్కన పెట్టేయడమే   విధానంగా మార్చుకున్నారు.. దీంతో వైసీపీలో ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే కరవైన పరిస్థితి తలెత్తిందని, పార్టీలో ఎవరూ జగన్ ను నమ్మి పోటీ చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఎదురౌతుండటంతో తెలుగుదేశంలో  చెల్లని కాసులైనా సరే అన్నట్లుగా ఎవరినో ఒకరిని తీసుకు వచ్చి అభ్యర్థులుగా నిలబెట్టే దుస్థితికి జగన్ వచ్చేశాడని, ఇదే వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీకి ఎండ్ కార్డ్ పడటం ఖాయమని అందరూ భావించడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా జగన్ తీరుతో పార్టీ శ్రేణుల్లోనే విజయంపై విశ్వాసం సన్నగిల్లిందంటున్నారు.