
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో కఠిన ఆంక్షలు, చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పటికే స్త్రీ విద్యను నిషేధించడంతో పాటు స్త్రీలు ఉద్యోగం చేయడాన్ని తాలిబాన్లు వ్యతిరేకిస్తున్నారు. మహిళల్ని వంటిళ్లకే పరిమితం చేశారు. చివరకు యూఎన్ కార్యక్రమాల్లో పనిచేసేందుకు కూడా వారిని అనుమతించడం లేదు. షరియా చట్టంతో ప్రజలపై తీవ్ర ఆంక్షల్ని విధిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో తలతిక్క ఆదేశాలిచ్చింది అక్కడి తాలిబాన్ సర్కార్. తాలిబాన్లకు జన్మస్థానమైన కాందహార్, దక్షిణ ఆఫ్ఘన్ ప్రావిన్స్‌లోని అధికారులు ‘‘ప్రాణాలు’’ ఉన్న వాటి ఫోటోలు, వీడియోలు తీయవద్దని ఆదివారం ఆదేశించింది. సివిల్, మిలిటరీ అధికారులను ఉద్దేశిస్తూ వెలువడిన లేఖలో.. ‘‘మీ అధికారిక, అనధికారి సమావేశాల్లో ప్రాణాలతో ఉన్న వాటి చిత్రాలు తీయడం మానుకోంది. ఎందుకంటే ఇది మంచి కంటే చెడునే ఎక్కువ కలిగిస్తుంది’’ అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. అధికారుల కార్యకలాపాలపై టెక్స్ట్, ఆడియో కంటెంట్‌కి అనుమతి ఉందని పేర్కొంది.
Read Also: Aishwarya Shankar: భర్తతో విడాకులు.. ఇప్పుడు తండ్రి అసిస్టెంట్ తో శంకర్ కూతురి ఎంగేజ్మెంట్
సాధారణం ఇస్లామిక్ ఆర్ట్‌లో మానవులు, జంతువులు నివారించబడుతాయి. కొంతమంది ముస్లింలు జీవుల చిత్రాలను చూడటాన్ని సహించరు. ఈ ఉత్తర్వులు ఎంత వరకు వర్తింపజేయబడుతుంది, ఎలా అమలు చేయబడుతుందనేది స్పష్టంగా లేదు. అయితే, ఈ లేఖ ప్రామాణికమైనదని కాందహార్ గవర్నర్ ప్రతినిధి వెల్లడించారు.
1996 నుంచి 2001 వరకు తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో టీవీలు, పిక్చర్లను నిషేధించారు. రెండు సంవత్సరాల క్రితం అక్కడి ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి మరోసారి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి అనేక మీడియా సంస్థలు మనుషులు, జంతువుల చిత్రాలను ఉపయోగించడం మానుకున్నాయి.