Leading News Portal in Telugu

Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..



Mamata Banerjee

Mamata Banerjee: ‘‘ఇందిరా గాంధీ కూడా ఓడిపోయింది’’.. బీజేపీకి మమత వార్నింగ్..టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీపై ఫైర్ అయ్యారు. ఇందిరాగాంధీ హాయాంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీతో బీజేపీ పాలనను పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించి తమ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం చేతులు కలిపాయని మమతా బెనర్జీ ఆరోపించారు.

Read Also: Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని అవ్దివ్కా నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా.. పుతిన్ ప్రశంసలు

రాష్ట్రంలో టీఎంసీ నేతల్ని కేంద్ర సంస్థలు అరెస్ట్ చేయడం 1970లో ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నేతల్ని అరెస్ట్ చేయడంతో పోల్చారు. అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ‘‘1975-77లో ఎమర్జెన్సీ కాలంలో 2000 మందిని జైల్లో పెట్టారు. ఎన్నికల్లో గెలుస్తామని ఇందిరా గాంధీ భావించారు. అయినా ఓడిపోయారు. నేడు ఈడీని, సీబీఐని ఎన్నికల కోసం బీజేపీ ఉపయోగిస్తోంది’’ మమతా బెనర్జీ బీర్బూమ్ బహిరంగ సభలో అన్నారు. ఈ రోజు కూడా సీబీఐ, ఈడీ, ఎన్నికల కమిషన్‌ని ఉపయోగించి ప్రజల్ని జైలులో పెట్టడాన్ని వ్యతిరేకించే హక్కు మనకు కూడా ఉందని ఆమె అన్నారు.

మనీలాండరింగ్ కింద మాజీ మంత్రులతో సహా పలువురు టీఎంసీ నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు వారిని జైళ్లకు పంపించిందని ఆరోపించారు. ఎలాంటి రుజువులు లేకుండా జైలులో ఉంచడం ద్వారా గెలుపొందాలని చూస్తున్నట్లు మమతా అన్నారు. టీఎంసీపై బీజేపీ దాడులు చేస్తోందని, అయితే బీజేపీలో ఒక్క నాయకుడిపైనైనా చర్య తీసుకుందా.? అని ప్రశ్నించారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), అలాగే పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) అమలుకు బిజెపి కుట్ర చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. యూనిఫాం సివిలో కోడ్ అమలు పేరుతో బీజేపీ ఆట ఆడుతోందని చెప్పారు.