గుంటూరు లోక్ సభ ..తెలుగుదేశం హ్యాట్రిక్ విజయాన్ని ఖాయం చేసేసిన పెమ్మసాని! | pemmasani confirmed third win| guntur| loksabha| constituencey| tdp
posted on Feb 19, 2024 8:01AM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది.. రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరువాత అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా పెద్ద జిల్లా గుంటూరు జిల్లానే. ఈ జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా పేరున్న నేతలు అనేక మంది ఉన్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు జరిగినా.. తెలుగేదేశంకు జిల్లాలో బలమైన క్యాడర్ ఉంది. ఒకటిరెండు ఎన్నికలు మినహా.. ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోట అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల అధిష్టానాలు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంపై దృష్టి సారించాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ గుంటూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గల్లా జయదేవ్ బరిలో నిలిచి విజయం సాధించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో గుంటూరు పార్లమెంట్ నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా హ్యాట్రిక్ విజయం సాధించాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో.. స్థానికంగా ప్రజల్లో మంచిపేరున్న వ్యక్తిని టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఆయనే బుర్రిపాలెం వాస్తవ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.
సూపర్‌స్టార్ దివంగత కృష్ణ గ్రామమైన బుర్రిపాలెంకు చెందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. నిజానికి ఆయన ఎన్ఆర్ ఐ అయినప్పటికీ.. కొన్నేళ్లుగా స్థానికంగా ఉంటూ ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈదఫా ఎన్నికల్లో తెలుగుదేశం – జనసేన పార్టీ అభ్యర్థిగా ఆయన గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే నియోజకవర్గంలో పెమ్మసాని విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి పెమ్మసాని. దీంతో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని టీడీపీ, జనసేన పార్టీల్లోని కిందిస్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకు పెమ్మసాని అంటే మంచి ఆదరణ చూపుతున్నారు. ఇటీవలే ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ప్రజాసేవలో ఇద్దరి భావజాలం ఒక్కటే కావడంతో వీరి మధ్య సమావేశం సుదీర్ఘంగా సాగింది. పవన్ తో సమావేశం తరువాత పెమ్మసాని మాట్లాడుతూ.. సమాజ సేవ ఒక మనిషికి అత్యంత తృప్తిని ఇస్తుందని మాట్లాడుకోవటం జరిగిందని, పవన్ తో మాట్లాడుతున్నసేపు నన్ను నాకే పరిచయం చేసినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ నుంచి పెమ్మసాని విజయం నల్లేరుపై నడేకేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం తెలుగుదేశానికి కంచుకోట కావడం.. జనసేన కూడా తోడవడంతో పెమ్మసాని విజయం నల్లేరు మీద బండి నడకేనని అంటున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదట. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉమ్మారెడ్డి వెంకటరమణను ప్రకటించారు. మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడే వెంకటరమణ. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గం వైపు చూడకపోవటంతో వైసీపీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. వెంకటరమణ గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి దిగేందుకు ఏ మాత్రం సుముఖంగా లేరని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఆయన లోక్ సభ అభ్యర్థిగా కాకుండా ఏదోఒక అసెంబ్లీ నుంచి బరిలోకి దిగడానికి మొగ్గు చూపుతున్నారంటున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వెంకటరమణ అసలు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? కొత్తవారు ఎవరైనా వస్తారా అని తేల్చుకోలేని పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు ఉన్నాయి.
గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం విషయంలో వైసీపీలో నెలకొన్న గందరగోళంతో ఆపార్టీలోని కొందరు నేతలు బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారట. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం అభ్యర్థిగా దాదాపు ఖాయం కావడంతో వైసీపీలోని అంసతృప్త నేతలు పెమ్మసానికి జై కొట్టేందుకు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. దీనికితోడు జనసైనికులు సైతం ఈ ఎన్నికల్లో తోడవుతున్నారు. పెమ్మసాని అభ్యర్థిత్వం దాదాపు ఖాయంకావడంతో వైసీపీలోని కొందరు నేతలు టీడీపీవైపు చూస్తున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మరోసారి టీడీపీ హ్యాట్రిక్ విజయం ఖాయమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.