posted on Feb 20, 2024 3:04PM
హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఓఆర్ఆర్‌పై ప్రయాణిస్తున్న ఓ కారు నార్సింగి సమీపంలో అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు చేస్తున్నారు.హైదరాబాద్ రింగ్ రోడ్డు ప్రమాదాలకు ఆలవాలంగా మారింది. ప్రయాణాలు సులువుగా చేయడానికి, హైదరాబాద్ లోపల రద్దీని తగ్గించడానికి, త్వరగా గమ్యం చేరడానికి ఏర్పాటైన రింగ్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యమైన డ్రైవింగ్ వంటి కారణాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.