
చైనాను (China) ఇసుక తుపాన్ హడలెత్తించింది. జిన్జియాంగ్లోని కొన్ని ప్రాంతాలను ఇసుక తుపాన్ చుట్టుముట్టింది (Massive Sandstorm). దీంతో ఆకాశం నారింజ (Sky Orange) రంగులోకి మారిపోయింది. కనీసం 100 మీటర్ల దూరంలోని వాహనాలు కూడా కనిపించనంత తీవ్రంగా నగరాలను కమ్మేసింది. దీంతో రహదారులపై ప్రజల భద్రత కోసం అధికారులు అత్యవసర ట్రాఫిక్ చర్యలను అమలు చేశారు.
బలమైన గాలులు, ఇసుక తుఫానులు వీస్తాయని చైనా వాతావరణ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఫిబ్రవరి 22 వరకు ఉష్ణోగ్రత అత్యంత తగ్గుదల ఉంటుందని ప్రజలకు వార్నింగ్ జారీ చేసింది.
జిన్జియాంగ్ప్రావిన్స్లోని టుర్పాన్ నగరంలో ఇసుక తుపాన్ దెబ్బకు రహదారులపై చీకటి కుమ్ముకుంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వేలమంది వీటిల్లో చిక్కుకుపోయారు. వీరిని పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉంటే నగరంలో ఉన్న ఇళ్లన్నీ దుమ్ముతో కమ్ముకుపోయాయి.
మరోవైపు గుంసు ప్రావిన్స్‌లోని జ్యూకాన్ నగరం దగ్గర జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. దాదాపు 40 వేల మంది ప్రయాణికులు రోడ్డు పక్కనే నిలిచిపోవాల్సి వచ్చింది. ఇసుక తుపానుకు పొగమంచు తోడు కావడంతో పరిస్థితి దారుణంగా మారిపోయింది. పలు చోట్ల ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. ఈ తుపాను దెబ్బకు వాతావరణంలో వ్యాపించిన దుమ్ము కారణంగా చాలా మంది ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చన్న భయాలు నెలకొన్నాయి.
ఈ ఇసుక తుపాన్ కారణంగా ప్రాణనష్టం జరిగిందా? లేదా? అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తోంది.