Leading News Portal in Telugu

AKhilesh: ఇండియా కూటమికి మళ్లీ షాక్.. మరో 9 మంది అభ్యర్థుల ప్రకటన



Akhilesh

ఇండియా కూటమికి (INDIA Bloc) సమాజ్‌వాదీ పార్టీ షాకుల మీద షాకిస్తోంది. మంగళవారం కూడా మరో 9 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం 11 మంది అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా మరో తొమ్మిది పేర్లను అఖిలేష్ యాదవ్ (AKhilesh Yadavs) ప్రకటించారు.

గతంలో 16 మంది అభ్యర్థులను అఖిలేష్ ప్రకటించారు. ఇక నిన్న, ఇవాళ కలిపి మొత్తం 20 మంది అభ్యర్థులను సమాజ్‌వాదీ పార్టీ వెల్లడించింది. దీంతో ఇండియా కూటమిలో ఏదో జరుగుతుందన్న అలజడి మొదలైంది.

2024 ఎన్నికల్లో మోడీ సర్కార్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఎవరికి వారే అభ్యర్థులను ప్రకటించేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించాయి. సమాజ్‌వాదీ పార్టీ మాత్రం కాంగ్రెస్‌తో చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు.

ఇదిలా ఉంటే సోమవారం అఖిలేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ 17 స్థానాలు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. మరోవైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోంది. కానీ అఖిలేష్ మాత్రం అటువైపు చూడలేదు. సీట్ల పంపకాలపై చర్చలు జరిగాకే రాహుల్ యాత్రలో పాల్గొంటానని తెగేసిచెప్పారు. కానీ ఈ సీట్ల పంచాయితీ మాత్రం ఇంకా తెగలేదు. మరోవైపు రాహుల్ యాత్ర బుధవారంతో యూపీలో ముగుస్తోంది. మరీ చివరి రోజైనా అఖిలేష్ పాల్గొంటారా? లేదంటే గమ్మునుంటారో వేచి చూడాలి.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటే గెలిచింది. అది కూడా రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. ఇప్పుడు కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నారు. కానీ చర్చలు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేస్తు్న్నారు. ముందు.. ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో వేచి చూడాలి.