Leading News Portal in Telugu

Wedding: పెళ్లి వేడుకలో అత్యుత్సాహం.. విషాదం మిగిల్చిన కాల్పులు



Mp Died

పెళ్లి (Wedding) అనేది జీవితంలో ఒక్కసారే చేసుకునేది. ఊహ వచ్చి.. తెలిసుండి చేసుకునేది పెళ్లొక్కటే. దీన్ని ఎంతో గ్రాండ్‌గా చేసుకోవాలని అనుకుంటారు. జీవితంలో గుర్తుండి పోయేలా చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లి ఏర్పాట్ల దగ్గర నుంచి మ్యారేజ్ అయ్యేంత వరకూ ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. లైటింగ్, డెకరేషన్లు, డీజే సౌండ్.. బాణాసంచా, డ్యాన్సులు.. ఇలా ఒక్కటేంటి?.. ఎన్నో ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. తప్పేం లేదు. కానీ పెళ్లి పేరుతో హద్దులు దాటితే మాత్రం.. సంతోషం కాస్తా.. విషాదంగా మారే అవకాశం ఉంటుంది. ఇదంతా ఎందుకంటారా? పెళ్లి సంబరాల్లో తుపాకీతో కాల్పులు జరపడం కొందరికి ఆనందాన్ని ఇస్తే.. మరొకరికి కడుపుకోత మిగిలింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-చంబల్ డివిజన్‌లో జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో ఒక చిన్నారి మృతి చెందగా.. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గ్వాలియర్, దతియా, శివపురి జిల్లాల్లో జరిగిన వివాహ వేడుకల్లో 48 గంటల్లోనే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

మొదటి సంఘటన.. గ్వాలియర్ జిల్లాలోని బడా గ్రామంలో వివాహం జరిగింది. పెళ్లి జరుగుతుండగా.. వరుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సచిన్ సింగ్ రాణా (20) అనే యువకుడి చేతికి కాలుకు బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైంది. సచిన్ సింగ్ రాణాను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చిన్నారి మృతి..
ఇక రెండో ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. డాటియాలో వివాహం జరుగుతుండగా కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తండ్రీకొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గ్వాలియర్ ఆస్పత్రికి తరలించారు. 4 ఏళ్ల పియూష్‌ను (Piyush) ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

పెళ్లి బారాత్ జరుగుతుండగా పియూష్(4) వరుడితో కలిసి మండపంపై కూర్చున్నాడు. ఇంతలో తుపాకీతో కాల్పులు జరపగా బుల్లెట్ చిన్నారి ఛాతీని చీల్చుకుని వెళ్లిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై.. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. నిందితులపై హత్య, హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇక మూడో సంఘటన.. ఆదివారం రాత్రి 12:30 గంటలకు శివపురి నగరంలోని ఛత్రి రోడ్డులో జరిగింది. ఇక్కడ కూడా పెళ్లి వేడుక జరుగుతుండగా తుపాకీ షాట్లు కాల్చారు. దీంతో ఒక బుల్లెట్ వరుడి (Groom’s Uncle) మామ ప్రకాష్ కుష్వాహ ఛాతీకి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఇలా మూడు పెళ్లి వేడుకల్లో సరాదా కోసం కాల్పులు జరిపితే కొందరి ప్రాణాలకు ముప్పు వచ్చి పడింది. పెళ్లి సంతోషాన్ని ఇవ్వాలి కానీ.. విషాదాన్ని మిగల్చకూడదు.