ఏపీలో ఎన్నికల తేదీ ఇదేనా? సోషల్ మీడియాలో వైరల్! | ap election heat peaks| election| date| viral| social
posted on Feb 21, 2024 7:53AM
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఎప్పుడో పెరిగిపోయింది. అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాల పేరుతో జాబితాల మీద జాబితాలు విడుదల చేసేస్తోంది. ఇక తెలుగుదేశం, జనసేనలు పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుపై చర్చలు జరుపుతున్నాయి. బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేనతో కలిసే అవకాశం ఉందంటున్నారు. ఇక విషయానికి వస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనంటూ పార్టీలు ప్రకటేనలు కూడా గుప్పించేస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ప్రచారం కూడా ఎప్పుడో ప్రారంభమైపోయింది.
అయితే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు అన్న విషయంలో ఇప్పటి వరకూ ఇంకా స్పష్టత రాలేదు. తొలుత ఫిబ్రవరి మూడో వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందనీ, మార్చి చివరిలో ఎన్నికలు జరుగుతాయనీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా సామాజిక మాధ్యమంలో ఏపీ ఎన్నికల తేదీ ఇదే నంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల 12న ఎన్నికల షెడ్యూల్ విడుదలౌతుందనీ, మార్చి 28న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమౌతుందనీ ఆ ప్రచారం సారాంశం. ఇక పోలింగ్ అయితే ఏప్రిల్ 19న జరుగుతుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. కౌంటిగ్ మే 22న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం మే 30న కొలువుదీరనుందని సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సరిగ్గా అవే తేదీలు అయినా, కాకపోయినా కొంచం అటూ ఇటూలో ఎన్నికలు జరుగుతాయి. అందులో సందేహం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలను బట్టి చూస్తే ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కు నిండా నెల రోజులు కూడా సమయం లేదు. ఎన్నికలకు ఇప్పటికే పార్టీలన్నీ సిద్ధమైపోయిన నేపథ్యంలో సీట్లు, అభ్యర్థుల విషయంలో ఇక ఆయా పార్టీలలో వేగం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేనలు పొత్తులో భాగంగా సీట్ల పంపకాల విషయంలో నేడో రేపో ఒక ప్రకటేన వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కూడా వీటితో కలుస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆ ప్రక్రియ ఎంత తొందరగా పూర్తవుతుందన్న దానిపైనే అభ్యర్థుల ప్రకటన ఆధారపడి ఉంటుంది.
ఒక వైపు సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు జరుపుతూనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు రా కదలిరా పేరిట సభలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంఖారావం పేరిట పర్యటనలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు. అలాగే అధికార వైసీపీ అధినేత జగన్ సైతం సిద్ధం పేర బహిరంగ సభలు నిర్వహిస్తుంటే.. జనసేనాని పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలతో ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నారు. మొత్తం మీద ఎన్నికల తేదీ ఇదే అంటూ నెట్టింట జరుగుతున్న ప్రచారంతో రాష్ట్రంలో రాజకీయ వేడి మరింత పెరిగిందనడంలో సందేహం లేదు.