Leading News Portal in Telugu

Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తు.. రాహుల్ యాత్రపై క్లారిటీ ఇచ్చేశారు!



Akhilesh Yadav

ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు అయోమయం.. గందరగోళం నెలకొంది. ఓ వైపు సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయని అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) చెబుతూనే.. ఇంకోవైపు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మూడు దఫాలుగా 36 మంది అభ్యర్థులను ప్రకటించేశారు. ఇంకోవైపు కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామంటూ రాయబారాలు నడుపుతోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ మాత్రం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే యూపీలోనే రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు అఖిలేష్ మాత్రం పాల్గొనలేదు. తాజాగా ఈ అంశంపై అఖిలేష్ స్పందించారు.

యూపీలో కాంగ్రెస్‌తో (Congress) తమ పొత్తు కొనసాగుతుందని.. రాహుల్‌ గాంధీతో (Rahul Gandhi) తమకు ఎలాంటి వివాదం లేదని బుధవారం అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో సంబంధాలు తెగిపోతోందన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు.

రాహుల్‌తో తమ సంబంధాలు బాగానే ఉన్నాయని.. ఎలాంటి వివాదం లేదని అఖిలేష్ తేల్చిచెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ మధ్య పొత్తు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 17-19 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని.. త్వరలోనే దీనిపై ఇరు పార్టీలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి అధికారిక ప్రకటన చేయనున్నట్లు చెప్పారు.

మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు 17–19 సీట్లు ఇచ్చేందుకు సమాజ్‌వాదీ పార్టీ అంగీకరించినట్లు తెలుస్తోంది. హత్రాస్‌కు బదులుగా సీతాపూర్‌ సీటును కాంగ్రెస్‌కు కేటాయించినట్లు సమాచారం. ఇక 2019 ఎన్నికల్లో యూపీలో రాయ్‌బరేలీ సీటు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది. అది కూడా సోనియా గాంధీ మాత్రం విజయం సాధించారు. అమేథీలో పోటీ చేసిన రాహుల్ మాత్రం ఓడిపోయారు. ఈసారి రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.