Leading News Portal in Telugu

Satya Pal Malik: జమ్మూ కాశ్మీరు మాజీ గవర్నర్‌ ఇంట్లో సీబీఐ సోదాలు



Cbi

Kiru Hydropower corruption case: జమ్ము కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు. జల విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నేటి ఉదయం నుంచి ఢిల్లీతో పాటు వివిధ పట్టణాల్లో ఆయనకు సంబంధించిన 30 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 మంది సీబీఐ అధికారులు పాల్గొన్నారు.

Read Also: Tunnel Roads: హైదరాబాద్ లో 5 టన్నెల్ రోడ్లు.. మూడు మార్గాల్లో 39 కి.మీటర్లు మేర సొరంగం

కాగా, సత్యపాల్ మాలిక్ గవర్నర్‌గా ఉన్న సమయంలో 2,200 కోట్ల రూపాయల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన అనుమతుల విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై 2022వ సంవత్సరం ఏప్రిల్‌ నెలలో సత్యపాల్‌ మాలిక్‌ సహా ఐదుగురిపై సీబీఐ కేసు ఫైల్ చేసింది. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్‌ 30 వరకు ఆయన జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌గా పని చేశారు. అయితే, సీబీఐ సోదాలపై సత్యపాల్‌ రియాక్ట్ అయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో.. తన నివాసంపై నిరంకుశ శక్తులు దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు.

Read Also: Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్.. అన్న కోసం వెళ్తే అడ్డంగా దొరికిపోయాడు!

ఈ సోదాల ద్వారా తన డ్రైవర్, సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారని మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సోదాలకు తాను భయపడేది లేదన్నారు. రైతుల పక్షాన నిలబడతానని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు తనను నిలువరించలేవని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా చెప్పుకొచ్చారు. అయితే, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని ఓ హస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.