Leading News Portal in Telugu

కడప ఎస్పితో సమావేశమైన వైఎస్ సునీత


posted on Feb 22, 2024 3:47PM

ఎపి సీఎం జగన్ స్వంత బాబాయ్ హత్య కేసులో పురోగతి లేకపోవడంతో  వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె కడప ఎస్ పి కార్యాలయానికి చేరుకున్నారు. ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నేడు కడప జిల్లా ఎస్పీతో సమావేశమయ్యారు.  ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్పీకి వివేకా హత్య కేసు వివరాలను తెలిపారు. తన భద్రతకు సంబంధించిన అంశాలపైనా సునీత ఎస్పీతో చర్చించారు.

ఎస్పీతో సునీత దంపతుల సమావేశం గంటపాటు సాగింది. వివేకా హత్యకేసులో ఇబ్బందులను వివరించారు. వివేకా పీఏ తమపై అనవసరంగా కేసులు పెట్టారని ఎస్పీకి తెలిపారు. వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి తీరును కూడా డాక్టర్ సునీత ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన అసభ్య పోస్టుల గురించి వివరించారు.

కడప ఎస్పీని సునీత దంపతులు కలవడం ఇది రెండోసారి. గతేడాది నవంబరులోనూ వారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి వివేకా హత్య కేసుపై చర్చించారు. అప్పట్లో సిద్ధార్థ్ కౌశల్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు.