Leading News Portal in Telugu

Smriti Irani: మాట నిలబెట్టుకున్న స్మృతిఇరానీ.. రాహుల్‌ ఏం చేస్తారో!



Central Minister House Open

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రమంత్రి స్మృతిఇరానీ (Smriti Irani) తన సొంత నియోజకవర్గంలో వారం రోజులుగా మకాం వేశారు. పలు కార్యక్రమాలతో బిజిబిజీగా ఉంటున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూనే.. పలు కొత్త పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అయితే తాజాగా అమేథీలో నిర్మించిన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసి రాజకీయంగా సరికొత్త సవాల్ విసిరారు.

2019 ఎన్నికల్లో తనను గెలిపిస్తే.. అమేథీ శాశ్వత చిరునామాగా మారుతుందని ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె చేసి చూపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీని ఓడించి స్మృతి ఇరానీ విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికల్లో చెప్పినట్టుగానే ఆమె కొత్త ఇల్లు నిర్మించుకోవడం గురువారం తన భర్తతో కలిసి గృహప్రవేశం చేసి హాట్‌టాఫిక్‌గా మారారు. ఎన్నికల ముందే కొత్త ఇంట్లోకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

2014 నుంచి రాహుల్‌, స్మృతి ఇరానీ అమేథీ (Amethi) నుంచి పోటీపడుతున్నారు. 2014లో ఓడిన ఆమె.. 2019లో విజయభేరీ మోగించి సంచలనం సృష్టించారు. దీంతో 2004 నుంచి 15 ఏళ్లుగా ఆ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న రాహుల్‌కు ఆ ఓటమి పరాభవాన్ని మిగిల్చింది. 2024లో మరోసారి వారు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఆ పోరు ఆసక్తిగా మారనుంది.

అమేథీ(Amethi) నుంచే మళ్లీ రాహుల్ పోటీ చేయాలని ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు. తాజాగా రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కార్యకర్తలంతా కోరారు. అయితే తుది నిర్ణయం త్వరలో వెలువడుతుందని ఇటీవల కాంగ్రెస్ వెల్లడించింది.

ఇక రాహుల్ మరోసారి అమేథీ నుంచి పోటీ చేయాలని కొద్దిరోజుల క్రితం కేంద్రమంత్రి (Smriti Irani) కూడా సవాల్‌ విసిరారు. ఆయన ఆధ్వర్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర’ అమేథీకి చేరుకున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఖాళీ వీధులు ఆయనకు స్వాగతం పలికాయంటూ ఎద్దేవా చేశారు.