బాబు గొప్ప విజనరీ.. తెలంగాణ సీఎం రేవంత్.. వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో? | telangana cm revanth praise babu as great visionary| it| foundation| combined| ap| ycp| reaction
posted on Feb 22, 2024 12:13PM
చంద్రబాబు నాయుడు, కేవలం ఒక రాష్ట్రానికి, ఒక ప్రాంతానికి, ఒక పార్టీకి పరిమితమైన నాయకుడు కాదు. సమకాలిన రాజకీయ నాయకుల్లో ముందు వరసలో నిలిచే జాతీయ నాయకుడు. నిజనికి చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, విజన్, విశ్వసనీయత మేళవించిన రాజనీతిజ్ఞుడు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తెచ్చిన ఆర్థిక, సాంకేతిక సంస్కరణల ప్రయోజనాలు పొందిన వేలాది మంది ఐటీ రంగ నిపుణులు, ఇంజనీర్లు వైద్యులు, ఆర్థిక సంస్కరణలను ఆసరా చేసుకుని, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక, సేవరంగాలలో దేశ విదేశాల్లో అగ్రగాములుగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఐటీ రంగాన్ని పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదే అనడంలో సందేహం లేదు. ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం అంగీకరించే నిజం. అంగీకరించిన వాస్తవం. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు ఐటీ రంగాన్ని తీసుకువచ్చి సైబరాబాద్ అనే ఒక మహానగరాన్ని నిర్మించి, హైద్రాబాద్ ను ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు ఘనతను రాజకీయ వైషమ్యాలు, రాజకీయ కక్షతో ఎవరో చెరిపేద్దామంటే చెరిగేది కాదు. ఈ విషయాన్ని తెలంగాణ ఐటీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆయన పదవిలో ఉన్నప్పుడే అంగీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసింది. ఐటీ రంగాన్ని అత్యున్నత స్థాయికి చేర్చినది చంద్రబాబు అన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరించి తీరుతారనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు ఇదే విషయాన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు. హైద్రాబాద్ కు ఐటీ రంగాన్ని తీసుకువచ్చినది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు అనడంలో సందేహాలకు తావు లేదని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైద్రాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర పునాదుల నుంచి స్లాబుల వరకు ఉంది. అయితే ఆ విషయాన్ని గుర్తించడానికి ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నేతలకు మాత్రం మనసు రావడం లేదు. అందుకే చంద్రబాబు విజన్ కారణంగా అంకురార్పణ చేసుకుని శరవేగంతో అభివృద్ధి చెందుతున్న అమరావతిని నిర్వీర్యం చేశారు. బాబు విజన్ ను విజ్ణతను ప్రశంసించే వారిపై అనుచిత విమర్శలతో విరుచుకుపడ్డారు. అసలు చంద్రబాబు గొప్పతనం ఆయన అధికారంలో ఉన్నప్పటి కంటే ఆయన విపక్షంలో ఉన్నప్పుడు మరింత ప్రస్ఫుటంగా కనిపించింది. ఆయనను జగన్ సర్కార్ రాజకీయ కక్షతో స్కిల్ స్కామ్ నెపంతో జైలులో పెట్టినప్పుడు.. మరింత ప్రకాశవంతంగా కనిపించింది. దేశ విదేశాలలో ఆయనకు మద్దతుగా ఆందోళనలు చెలరేగాయి.
ఆయన జైలులో ఉన్న సమయంలోనే జరిగిన సైబర్ టవర్స్ రజతోత్సవ కార్యక్రమం చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందు చూపుకు దర్పణంగా నిలిచింది. పాతికేళ్ళకు ముందు నాడు,కొండలు గుట్టల నడుమముందు చూపుతో చంద్రబాబు నాయుడు నాటిన ఐటీ విత్తనం మహావృక్షమై నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది.తెలుగు యువత హైటెక్ భవితకు బంగరు బాటలు పరిచిన విజనరీకి వందనం చేయటమే కాకుండా గళం విప్పి గర్జించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు 30 ఏళ్లలోపు వారే కావటం ఒక ఎత్తు అయితే.. ఈ సందర్భంగా పెల్లుబుకిన అభిమానం కొత్త చర్చకు తెర తీసింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన యువ కిశోరాలు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలుస్తామని.. సంఘీభావాన్ని ప్రకటించటంతో పాటు.. ఆయన విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నట్లుగా చెప్పుకున్న వైనం చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో స్థిరంగా ఉన్నరనే విషయం సందేహాలకు అతీతంగా రుజువైంది.
అయినా జగన్ మూకకు అవేమీ కనిపించలేదు. వినిపించలేదు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చంద్రబాబు గొప్పతనాన్ని మరోసారి చాటడం వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదు. గతంలో చంద్రబాబును ప్రశంసించిన సూపర్ స్టార్ రజనీకాంత్ పై విమర్శలతో విరుచుకుపడినట్లుగా ఇప్పుడు పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిపై కూడా మాటల దాడికి తెగబడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.