
ఉల్లి ఎగుమతులపై (Onion Exports) కేంద్ర ప్రభుత్వం (Modi Government) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సడలించింది. నాలుగు దేశాలకు పరిమిత స్థాయిలో ఉల్లిపాయల్ని ఎగుమతి చేసుకొనేందుకు వ్యాపారులకు అవకాశం కల్పించింది. ఈ మేరకు కేంద్రం ఆదేశించింది.
దేశ వ్యాప్తంగా ఉల్లి ఎగుమతులపై నిషేధం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకు బంగ్లాదేశ్, మారిషస్, బెహ్రెయిన్, భూటాన్‌లకు 54,760 టన్నుల ఉల్లిపాయల్ని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈమేరకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌కుమార్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, బహ్రెయిన్‌కు 3 వేల టన్నులు, భూటాన్‌కు 560 టన్నుల చొప్పున ఉల్లిని ఎగుమతి చేసేందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.
మార్చి 31 వరకు మాత్రమే నిర్దేశించిన పరిమాణంలో ఉల్లిని ఎగుమతి చేసేందుకు వ్యాపారులకు అనుమతి ఉందని ఆయన స్పష్టంచేశారు. దీనికి సంబంధించిన విధివిధానాల్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర విదేశాంగ శాఖ సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
దేశంలో ఉల్లి ధరలకు చెక్ పెట్టేందుకు.. దేశీయంగా సరఫరా పెంచేందుకు వీలుగా కేంద్రం గతేడాది డిసెంబర్ 8న ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ నిషేధం మార్చి 31 వరకు కొనసాగుతుందని స్పష్టంచేసింది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ నిషేధాన్ని సడలిస్తూ నాలుగు దేశాలకు ఎగుమతి చేసేందుకు రైతులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.