posted on Feb 24, 2024 4:13PM
తిరుమల గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు టీటీడీ ఐటీ విభాగం జీఎం సందీప్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు.
టీటీడీతో పాటు ఈవో ధర్మారెడ్డిపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో ఉంది. అయితే ఆ వీడియోపై తాజాగా రమణ దీక్షితులు స్పందించారు. టీటీడీ ఈవోకు లేఖ రాశారు. ఆ వీడియోలో ఉన్నది తన గొంతు కాదని చెప్పుకొచ్చారు.ఇప్పటి వరకు తాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ను కలవలేదని తెలిపారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగేలా.. ఈవోకీ వ్యతిరేకంగా తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. టీటీడీతో ఉన్న సంబంధాలతో పాటు తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఆ వీడియో ఉందన్నారు. ఈ అంశంపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని రమణ దీక్షితులు వెల్లడించారు.