Leading News Portal in Telugu

Ravi River: పాకిస్తాన్‌కి షాక్.. రావి నది నీటిని నిలిపేసిన భారత్..



Ravi River

Ravi River: సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్‌కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు.

బ్యారేజీ పూర్తి కావడంతో షాపూర్ వద్ద నీటి నిలుపుదల ప్రక్రియ ప్రారంభం అయింది. భారత్-పాక్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రిటీ ప్రకారం.. భారత్ ఇప్పుడు రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోనుంది. గతంలో పాత లఖన్‌పూర్ డ్యామ్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించే నీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రజలకు ఉపయోగపడనున్నాయి.

Read Also: Uttarakhand: ఆందోళనల్లో “ఆస్తి నష్టాన్ని రికవరీ చేసేందుకు బిల్లు”ని తీసుకురానున్న ఉత్తరాఖండ్..

షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్ట్‌కు 1995లో మాజీ ప్రధాని PV నర్సింహారావు పునాది రాయి వేశారు. అయితే, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విబేధాల కారణంగా చాలా కాలం అడ్డంకులు ఎదుర్కొంది. పీఎం మోడీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తోమర్ జోక్యం చేసుకునే వరకు ఈ ప్రాజెక్టు పనులు కదల్లేదు. 2018 తర్వాత పనులు పున:ప్రారంభమయ్యాయి. రూ. 3300 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీటితో పాటు 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఇటీవల సింధు నది మరో ఉపనది అయిన ‘చీనాబ్’ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది. జమ్మూకాశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు‌ని వేగవంతం చేసేందుకు చీనాబ్ నది నీటిని మళ్లించింది. సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లు, పాకిస్తాన్‌కి సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.