Leading News Portal in Telugu

బీఆర్ఎస్ పై కేసీఆర్ పట్టు కోల్పోయారా? | kcr lost grip on brs| leaders| sitting| mps| mlas| leaving| party| join


posted on Feb 26, 2024 3:04PM

తెలంగాణ ఆవిర్భావం తరువాత రెండు దఫాలు బీఆర్ఎస్ పార్టీని విజయం దిశగా నడిపిన కేసీఆర్..  ఒక్క ఓటమితో పార్టీపై పట్టు కోల్పోయారా అంటే పరిస్థితులను చూస్తుంటే ఔననక తప్పదు. నిజమే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత కేసీఆర్ పట్టు కోల్పోయారని చెప్పక తప్పని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. ఎన్నికలలో ఓటమి తరువాత బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఓటమి నుంచి తేరుకుని త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీ సమాయత్తం అవ్వాల్సిన తరుణంలో  కేసీఆర్ ను పార్టీ నేతలు లెక్కచేడయంలేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  

 బీఆర్ఎస్ నుంచి పెరుగుతున్న వలసలను చూస్తుంటే కేసీఆర్ ను పార్టీ నేతలు లెక్క చేయడం లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేని పరిస్థితి కనిపిస్తోంది. పెద్దపల్లి సిట్గింగ్ ఎంపీ వెంకటేశం నేత కాంగ్రెస్ గూటికి చేరారు.  మరింత మంది కూడా అదే దారిలో ఉన్నట్లు చెబుతున్నారు.  ఏకంగా సిట్టింగ్ ఎంపీలే పార్టీ నుంచి బయటకు రావడానికి తహతహలాడుతున్నారు. ఇక ద్వితీయ శ్రేణి నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, క్యాడర్ సంగతి అయితే చెప్పనవసరంలేదు. లోక్‌సభ ఎన్నికల వేళ  ఈ పరిణామాలు బీఆర్ఎస్ ను నిస్తేజంలోకి నెట్టేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఈ వలసలు జోరందుకుంటాయని చెబుతున్నారు. కనీసం పార్టీ అధినేతకు సమాచారమైనా ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలవడం, అడిగితే అందులో తప్పేముంది.. గతంలో కేసీఆర్ సీఎంగా ఉండగా కాంగ్రెస్ నేతలు ఆయనతో భేటీ అయిన సందర్బాలు లేవా అని ప్రశ్నిస్తున్నారు.  ఇక సిట్టింగ్ ఎంపీలైతే ఏకంగా గడప దాటేసి చేయి అందుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని పక్కన పెట్టి   లోక్‌సభ ఎన్నికల్లోనైనా కొంత బలపడదామని భావిస్తున్న పార్టీ అధిష్టానానికి ఈ పరిణామం మింగుడు పడటం లేదు. పార్టీ నుంచి వలసలను ఎలా నిలువరించాలో అర్ధం కాక తల పట్టుకునే పరిస్థితిలో పార్టీ అగ్రనాయకత్వం ఉంది. పార్టీ మారిన వారిపై గట్టిగా విమర్శిద్దామంటూ గతంలో తాము చేసినదేమిటన్న ప్రశ్న ఎదురౌతుందన్న భయం, బెంగ అడ్డు వస్తున్నాయి.  

అన్నిటికీ మించి వ్యూహాలు పన్నడంలో దిట్ట అని గుర్తింపు పొందిన కేసీఆర్ ఇప్పుడు అచేతనంగా మిగిలిపోవడంతో ఆయన నాయకత్వ సమర్థతపైనే పార్టీలో అనుమానాలు పొడసూపుతున్న పరిస్థితి. పార్టీ నుంచి వలసనలను నివారించడంలో కేసీఆర్ వైఫల్యం పార్టీలో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పాలి.  ఇంత జరుగుతున్నా కేసీఆర్ కిమ్మనకపోవడంతో ఆయన రాజకీయంగా సైడైపోయారా అన్న అనుమానాలు పార్టీలోనే వ్యక్తం అవుతున్నాయి.   గ్రేటర్ లో బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయం అన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తం అవుతుంటే.. బీఆర్ఎస్ అధినేత తీరు ఆయన అందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలకు తావిస్తోంది. 

బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్,   శ్రీలత,   పట్నం సునీతారెడ్డి, అనితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇలా చాలా మంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు.  మున్సిపాలిటీలలో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు సైతం పదుల సంఖ్యలో హస్తం పార్టీ గూటికి చేరారు. అధికారంలో ఉన్న పదేండ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి  నేతలను లాక్కున్న బీఆర్ఎస్ కు ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లి పోతున్న నేతలను చూసి గతంలో మనం ఇలాగే చేశాం కదా అని అనుకోవడమే మిగిలిందని పరిశీలకులు అంటున్నారు.   

పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్‌లో చేరడం, నాగర్‌కర్నూల్ ఎంపీ సైతం అదే దారిలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో జహీరాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ఖమ్మం ఎంపీలు సైతం పార్టీ మారతారన్న ప్రజారం జోరందుకుంది. అలాగే పలువురు ఎమ్మెల్యేలు సైతం ఇప్పటికే కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారనీ, లోక్ సభ ఎన్నికల నాటికి వీరంతా కాంగ్రెస్ పంచన చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.