Leading News Portal in Telugu

Manjummel Boys Review: మంజుమ్మేల్ బాయ్స్(మలయాళం) రివ్యూ



Manjummel Boys Review

Manjummel Boys Review: మలయాళంలో ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మూడు సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముందుగా వచ్చిన ప్రేమలు, తరువాత వచ్చిన భ్రమ యుగం సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అందులో భ్రమ యుగం తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక ప్రేమలు సినిమాను రిలీజ్ చేసేందుకు డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఇక ఈ గ్యాప్ లో మరో సినిమా వచ్చి హిట్ అందుకుంది. మంజుమ్మేల్ బాయ్స్ పేరుతో ఈ సినిమా 22వ తేదీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.

మంజుమ్మేల్ బాయ్స్ కథ:
తమిళనాడులోని కొడైకెనాల్‌లోని గుణ గుహల వద్ద జరిగిన విషాదాన్ని ఎదుర్కొన్న కొచ్చికి చెందిన మంజుమ్మెల్‌కు చెందిన 11 మంది యువకుల కథ ఇది. 2006లో జరిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. కొచ్చికి చెందిన మంజుమ్మెల్‌ అనే ప్రాంతానికి చెందిన 11 మంది కొడైకెనాల్ ట్రిప్ వెళ్తారు. తమ ప్రత్యర్థి బృందం మున్నార్‌కు విహారయాత్రకు వెళ్లడాన్ని చూసి అసూయతో కొడైకెనాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుని అక్కడకి వెళ్లి కమల్ హాసన్ గుణ సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ -గుణ కేవ్స్ చూడాలని అనుకుంటారు. నిషేధిత ప్రాంతం అని తెలిసి కూడా వాళ్ళు లోపలికి వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్లిన క్రమంలో సుభాష్(శ్రీనాథ్ బాషి) ఒక లోతైన గోతిలో పడిపోతాడు. పోలీసుల దగ్గరకు వెళ్తే మీరే తోసేసి ఉంటారని అనడంతో ఆ కుర్రాళ్లకు ఏమీ అర్ధం కాదు. అంతేకాదు అక్కడ 13 మంది మరణించారు కాబట్టి మీ వాడిని మరచిపోమంటారు. మీడియాకి విషయం పొక్కడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకి లోపల పడిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని అర్థం అవుతుంది. దీంతో ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ టీం కూడా వస్తుంది. అయితే మనిషి దూరడానికి కూడా లేని ఆ గోతిలో పడ్డ సుభాష్ ను బయటకు తీసుకొచ్చారా? సుశిక్షితులు అయిన ఫైర్ సిబ్బందే లోపలికి వెళ్ళడానికి భయపడినప్పుడు ఆ మిగతా 10 మంది ఏమి చేశారు? చివరికి ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:
మంజుమ్మెల్ బాయ్స్‌ సినిమా ఓపెనింగ్ లోనే ఒక కుర్రాళ్ళ గుంపు వివాహ విందులో ఆహ్వానించబడని అతిథులుగా వెళ్లి సరదాగా గడపడమే కాకుండా వారికి ప్రత్యర్థి గ్యాంగ్‌తో గొడవలకు దిగడం కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కథలోకి తీసుకు వెళ్ళడానికి కూడా బాగా సమయం తీసుకున్నాడు దర్శకుడు. అందుకే కథ కొంచెం సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ గ్యాంగ్ అంతా కలిసి ట్రిప్ బయలు దేరతారో అప్పుడు సినిమా వేగం పుంజుకుంటుంది. ఇక కొడైకెనాల్ వెళ్లడం, అక్కడ గుణ కేవ్స్ చూసేందుకు లోపలికి వెళ్లి సుభాష్ అందులో పడడంతో ఒక్కసారిగా అందరూ స్టన్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. ఎప్పుడైతే ఒక మనిషి గుంతలో పడ్డాడో మరుక్షణం నుంచి థియేటర్ లోని వారంతా షాకయ్యి తరువాత ఏం జరగనుంది? అనే టెన్షన్ లో పడిపోతారు. ఇక కమల్ హాసన్ పట్ల తనకున్న ప్రత్యేక ఆసక్తి గురించి దర్శకుడు చిదంబరం టైటిల్స్ లోనే క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇక ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో చూసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి బదులుగా సెకండాఫ్‌లో వచ్చే ఒక హై మూమెంట్ లో అదే పాటను పే ఆఫ్‌గా ఉపయోగించి ట్రిబ్యూట్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా మొదటి 20 నిమిషాల్లో ప్రేక్షకులకి చూపిన ప్రతి విషయానికి క్లైమాక్స్ కి లింక్ చేస్తూ డైరెక్టర్ చేసిన మ్యాజిక్ బాగుంది. చిన్ననాటి విషయాలను ప్రస్తుత కాలానికి లింక్ చేస్తూ చేసిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు తీసులొస్తుంది. లైఫ్ అనేది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్‌టెస్ట్ అని మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. అలాంటి సర్వైవల్ థ్రిల్లర్‌లలో మంజుమ్మెల్ బాయ్స్ ఒక మంచి ఆప్షన్.

నటీనటుల విషయానికి వస్తే మెయిన్ పాత్ర సుభాష్‌గా శ్రీనాథ్ భాసి అద్భుతమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు కూడా అతని బాధను అనుభవించేలా చేయడం మామూలు విషయం కాదు. ఇక కుట్టన్ గా శౌబిన్ షాహిర్ కూడా సరిగ్గా సెట్ అయ్యాడు. ఇక ఖైదీ ఫేమ్ జార్జ్ మరియన్ అలాగే మరియు మరికొందరు తమిళ నటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే అన్ని క్రాఫ్ట్స్‌లో షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ స్పెషల్ అనిపిస్తుంది. ప్రేక్షకులు టెన్షన్‌ను అనుభవించేలా అద్భుతమైన పనితనం చూపాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ ను మెచ్చుకోకుండా ఉండలేం. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం అద్భుతంగా చేసిన సౌండ్ డిజైన్‌కి బాగా కలిసొచ్చింది. ఇక కొంత కత్తిరించాల్సి ఉన్నా ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో సఫలం అయ్యారు.

ఇక ఫైనల్ గా: మలయాళంలోనే కాదు ఇండియన్ మూవీ హిస్టరీలో వచ్చిన అతితక్కువ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఈ సినిమా నిలుస్తుంది.