కేసీఆర్ రంగంలోకి.. లోక్ సభ ఎన్నకలలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు! | kcr stratagies for loksabha elections| farm| house| ktr| harish| meet| kavitha| revanth| government
posted on Feb 27, 2024 11:42AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరువాత డీలా పడిన బీఆర్ఎస్ క్యాడర్ లో ఉత్సాహం నింపి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా చైతన్య పరిచేందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగారు. తన ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో వచ్చే ఆరు వారాలూ అత్యంత కీలకమని, నేతలు ప్రజలలోనే ఉండేలా వరుస కార్యక్రమాలు నిర్వహించాలనీ కేసీఆర్ కేటీఆర్, హరీష్ లను ఆదేశించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నేతలు పలువురు ఆ పార్టీలో చేరడం, మరి కొందరు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లడం తదితర పరిణామాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తున్నది. నేతలు, క్యాడర్ పక్క చూపులు చూడకుండా వరుస కార్యక్రమాలతో వారిని బిజీగా ఉంచాలని కేసీఆర్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ గ్యారంటీలలో ఇప్పటి వరకూ అమలు చేయని వాటిపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ, అలాగే నిరుద్యోగ భృతి, రూ. రెండు లక్షల రుణమాఫీ, జాబ్ నోటిఫికేషన్ తదితర అంశాలపై రేవంత్ సర్కార్ పై విమర్శలు గుప్పించాలని కేసీఆర్ ఆదేశించారని చెబుతున్నారు.
జిల్లాల వారీగా కోఆర్డినేషన్ కమిటీల ఏర్పాటు, క్యడర్ ను నేతలను లోక్ సభ ఎన్నికల ప్రచారంలో యాక్టివ్ గా పాల్గొనేలా వరుస కార్యక్రమాలను నిర్వహించాలని కేసీఆర్ ఈ సందర్భంగా కేటీఆర్, హరీష్ రావులకు చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలోని సీనియర్, కీలక నేతలకు సమన్వయ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినట్లు చెబుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు జగదీశ్ రెడ్డి, మధుసూధనాచారి, కడియం శ్రీహరి, పల్లారాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, నామా నాగేశ్వర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ కవిత, కె.కేశవరావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి తదితరులకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తరువాత కేసీఆర్ తన కుమార్తె కల్వకుట్ల కవితతో భఏటీ అయ్యారు. ఆమెను లిక్కర్ స్కాంలో నిందితురాలిగా పేర్కొంటూ జారీ చేసిన నోటీసులపై చర్చించారు. కవిత పిటిషన్ పై బుధవారం (ఫిబ్రవరి 28)న తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కవిత, కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.