Leading News Portal in Telugu

Pakistan: పాకిస్తాన్ పరిస్థితి ఇది.. పీఐఏ విమానాల్లో వెళ్లి కెనడాలోనే సెటిల్ అవుతున్న “ఎయిర్‌హెస్టెస్‌లు”..



Pia

Pakistan: పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా ఆ దేశం అనేక కష్టాల్లో చిక్కుకుంది. ఇక ఆ దేశంలోని అన్ని సంస్థలు దాదాపుగా దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఒకటి. ఇంధన ధరలు పెరిగిపోవడం, అప్పులు ఇలా పీఐఏ ఆర్థిక సమస్యల్లో ఉంది. తమను ఆదుకోవాలని దేశ ప్రభుత్వాన్ని కోరింది.

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ విమానాల్లో ఎయిర్‌‌హోస్టెస్‌లుగా, విమాన సిబ్బందిగా కెనడాకు వెళ్లిన వారు, మళ్లీ స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఇష్టపడటం లేదు. కెనడాకు వెళ్లి మాయమవుతున్నారు. ఆ దేశంలోనే సెటిల్ అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా సోమవారం ఇస్లామాబాద్ నుంచి కెనడాలోని టొరంటో వెళ్లిన విమానంలో ఫ్లైట్ క్రూలో ఒకరిగి ఉన్న మర్యమ్ రజా కెనడాలో అదృశ్యమయ్యారు. ఒక రోజు తర్వాత కరాచీకి తిరిగి వచ్చే విమానంలో ఆమె డ్యూటీకి రిపోర్ట్ చేయలేదు.

Read Also: Viral Video : వావ్ సూపర్.. డ్యాన్స్ తో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన ఆఫీసర్.. వీడియో వైరల్..

అయితే, మరియమ్ కోసం వెతికిన అధికారులకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ఆమె బస చేసిన హోటల్ గదిలో వెతికినప్పుడు పీఐఏ యూనిఫాంతో పాటు ‘‘ థాంక్యూ, పీఐఏ’’ అని రాసిని నోట్ కనుక్కోవడంతో కంగుతిన్నారు. మరియమ్ ఒక్కరే కాదు, ప్రతీ ఏటా సగటున ఐదుగురు పాకిస్తాన్ ఫ్లైట్ సిబ్బంది కెనడాకు వెళ్లి అక్కడే ఉండేందుకు సిద్ధపడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో పీఐఏ ఫ్లైట్ అటెండెంట్ ఫైజా ముఖ్తార్ కూడా అదృశ్యమయ్యారు. తాజాగా మరియమ్ కూడా ఇదే విధంగా కెనడాలో ఉండేందుకు ఇష్టపడుతోంది. పీఐఏ క్రూ సభ్యులు 2018 నుంచి కెనడాలో ఆశ్రయం కోరుతున్నారు. క్రూ సభ్యుల అదృశ్యం పీఐఏకి ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్‌లో భవిష్యత్ అంధకారమే అని తెలిసి అక్కడి యువత వేరే దేశాలకు వెళ్లేందుకు, ముఖ్యంగా యూఎస్, యూరప్ దేశాల్లో స్థిరపడేందుకు వలస వెళ్తున్నారు.

2023లో ఏడుగురు పీఐఏ సిబ్బంది కెనడాలో కనుమరుగయ్యారు. లాహోర్ నుంచి టొరంటో వెళ్లిన విమానంలో క్రూగా ఉన్న అయాజ్ ఖురేషీ, ఖలీద్ అఫ్రిది, ఫిదా హుస్సేన్ షాలు డిసెంబర్ 2023లో మళ్లీ పాక్ తిరిగి రాలేదు. చివరకు విమానం క్రూ లేకుండా ఇస్లామాబాద్ రావాల్సి వచ్చిందని పీఐఏ అధికారులు వెల్లడించారు. కెనడా ఉదారవాద ఆశ్రయ విధానాలు పీఐఏపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆ సంస్థ ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ తెలిపారు. తక్కువ జీతాలు కూడా ఇందుకు ఓ కారణమని తెలుస్తోంది.