Leading News Portal in Telugu

జంబ్లింగ్ స్టార్ విడదల రజనీ! | jumbling star vidadala rajani| guntur| west| contest| ycp| campaign


posted on Feb 29, 2024 12:06PM

ఎన్నికలు దగ్గర కొస్తున్నాయంటే.. రాజకీయ నాయకుల్లో అలజడి మొదలవుతుంది.  అధికారంలో ఉన్న వారికి అయితే.. మళ్లీ అధికారం అందుకుంటామో? లేదో?.. ఓ వేళ అధికారంలోకి రాకుంటే.. అందునా మంత్రి పదవి లేకుంటే.. కార్ల కాన్వాయి, గన్‌మెన్లు, కెమెరామెన్లతో ఇన్నాళ్లు చేసిన హడావుడి అంతా.. వచ్చే ఎన్నికల ఫలితాల తర్వాత గాలికి కొట్టుకు పోయినట్లు కొట్టుకు పోతే.. ఆ తర్వాత పరిస్థితి ఏమిటి.? అన్న అలజడి. అందుకే.. ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత.. ఏం చేసినా.. చేయకున్నా.. ఎన్నికలకు జస్ట్ వంద రోజుల ముందు జనంలోకి వెళ్లి ఓ షో చేస్తే.. అంటే.. ఆటోలు నడపడం.. ట్రాక్టర్లు నడపడం.. సైకిళ్లు తొక్కడం.. బైక్ ర్యాలీలో బైక్ నపడం వంటి షోలన్నమాట.  ఆ షో సక్సెస్ అయితే.. అనంతరం శతదినోత్సవ వేడుకలే వేడుకలు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీ బాగానే పసిగట్టి.. ప్రజలను ఆకట్టుకోనేందుకు జనం మధ్యకు వస్తున్నారన్న   చర్చ గుంటూరు నగరంలో వైరల్ అవుతోంది. 

తాజాగా మంత్రి విడదల రజనీ.. ఆటో డ్రైవర్ షర్ట్ వేసుకొని ఆటో నడుపుతున్న ఓ వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో కీ ఇచ్చిన బొంగరంలా గిర్రా గిర్రా తిరుగుతోంది. దీనిపై గుంటూరు నగర వాసులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  ఆసుపత్రిలో విధులకు వచ్చే వైద్యులు తెల్ల కోటు వేసుకున్నారో లేదో?   వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ ఆటో డ్రైవర్ షర్ట్ మాత్రం ఆమె  వేసుకున్నారంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఆమె ఆటో నడిపారని .. అందుకు సంబంధించిన చిత్ర రాజాలు నేటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని గుంటూరు నగర వాసులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.  బాషా సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌లా  విడదల రజినీ సైతం ఆటో డ్రైవ్ చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. ఆటో నడపడం ఇలా చూసి ఆలా పట్టేసి.. అలా అలా నడిపేస్తున్నారని నవ్వుకుంటున్నారు. 

2014 ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ విజయం  కోసం యూఎస్ నుంచి వచ్చిన వారిలో విడదల రజనీ ఒకరు. ఆ సమయంలో ఆ పార్టీ విజయం కోసం ఆమె సహకరించారని.. ఆ క్రమంలో 2017లో  విశాఖ వేదికగా జరిగిన ఆ పార్టీ మహానాడులో.. సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను తానంటూ చెప్పుకొచ్చారు.  ఆ తర్వాత ఆమె చిలకలూరిపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసేందుకు  టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై.. ఆ వెంటనే జగన్ పార్టీలోకి జంప్ కొట్టేశారు. ఆ పార్టీ తరఫున  బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రి పదవి సైతం సంపాదించేశారు.  అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆమె.. తన వంతు ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు.  అందులోభాగంగా ఈ సారి తన అదృష్టాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నిలబడి పరీక్షించు కొంటున్నారు. అయినా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు…ఆటో నడిపి.. బాషా సినిమాలో రజనీ కాంత్‌ను గుర్తు చేస్తున్నారని.. ఏమైనా రజనీ.. రజనీనేనని.. ఆయన వెండి తెర మీద సూపర్ స్టార్ అయితే.. ఆమె పోలిటికల్ జంబ్లిగ్ స్టార్ అని గుంటూరు వాసులు తమదైన శైలిలో వ్యంగ్యంగా అంటున్నారు.     

ఇక గత ఎన్నికల్లో విడదల రజనీ జగన్ వేవ్‌లో చాలా సునాయాసంగానే గెలిచారనీ, అయితే  ఈ సారి మాత్రం ఆమె గెలుపు అంత సులువేమి కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట,  గత ఎన్నికల వేళ  జగన్ వేవ్‌లో సైతం ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న సంగతిని ఈ సందర్భంగాగుర్తు చేస్తున్నారు. 

అదీకాక ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థిగా గల్లా మాదవి పేరు ఖరారు చేయనున్నారనే ఓ ప్రచారం అయితే ఇప్పటికే స్థానికంగా ఊపందుకొంది. ఇక ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్లు అధికం. అలాంటి వేళ ఈ నియోజకవర్గంలో మళ్లీ పసుపు పార్టీ జెండా రెపరెపలాడడం కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మరోవైపు రానున్న ఎన్నికల్లో చిలకలూరిపేటలో విడదల రజనీకి ఓటమి తప్పదని సర్వేలు రావడంతో.. ఆమెను జంబ్లింగ్ విధానంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ పంపారు. ఏదీ ఏమైనా.. విడదల రజనీ.. రజనీ కాంత్‌లా ఆటో నడిపినా.. బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనంటూ డైలాగులు పేల్చినా.. రానున్న ఎన్నికల్లో ఆమె గెలుపు అంత ఈజీ కాదనే ఓ చర్చ అయితే గుంటూరు వాసుల్లో వైరల్ అవుతోంది.