
ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదనే అపోహను తొలగించాలన్నారు. పేదలకు సంక్షేమం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ఆమె చెప్ప్పుకొచ్చారు.
చంద్రబాబుది డైరెక్షన్.. పవన్‌ది యాక్షన్:
టీడీపీ-జనసేన జెండా సభలో పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చూసి చదివాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. నారా చంద్రబాబు నాయుడుది డైరెక్షన్ అయితే.. పవన్ కళ్యాణ్‌ది యాక్షన్ అని విమర్శించారు. చంద్రబాబు చెప్పింది పవన్ చేయడం వల్ల ముద్రగడ, హరిరామ జోగయ్య లాంటి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తనకు సలహాలు ఇవ్వవద్దని చెప్పడం పవన్ ఒక జాతిని అవమానించినట్లే అని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. టీడీపీ-జనసేనది ఎజెండా లేని జెండా సభ అని మంత్రి చెప్పుకొచ్చారు.
రైతును 2 కిలోమీటర్లు మోసిన కానిస్టేబుల్:
కరీంనగర్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ ఓ రైతును ప్రాణాలు కాపాడిన తీరుపై ప్రశంసల జల్లు కురిపిస్తుంది. విధుల్లో వున్న కానిస్టేబుల్ కు ఓ రైతు పురుగుల మందు తాగడంలో స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న కానిస్టేబుల్.. రైతును భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్లు నడిచి ప్రాణాలు కాపాడాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన కుర్ర సురేష్ బుధవారం ఇంట్లో గొడవపడి తన పొలానికి వచ్చాడు. జీవితంలో విసుగుచెందిన రైతు తన పొలంలోనే పురుగుల మందు తాగాడు. అక్కడున్నవారు గమనించి 100కు సమాచారం అందించగా.. వెంటనే బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అంబులెన్స్ కు కాల్ చేసి అది వచ్చి తీసుకునే వెళ్లే సరికి రైతు ప్రాణాలు మిగలవని భావించి.. వెంటనే కానిస్టేబుల్ జయపాల్ అతడిని భుజాన వేసుకుని పొలాల మీదుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యుల సాయంతో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైతు సురేష్ కు వైద్యులు వెంటనే వైద్యం అందించారు. ప్రస్తుతం సురేష్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు:
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష పాడ్యమి నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది కూడా దేవస్థానంలో రామనవమి బ్రహ్మోత్సవాలను ఆలయ కమిటీ నిర్వహించనుంది. ఈ మేరకు ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాల తేదీలను వైదిక కమిటీ ప్రకటించింది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 23 వరకు నిర్వహించనున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న స్వామివారి కల్యాణం జరగనున్నాయి. రాములోరి పట్టాభిషేకం ఏప్రిల్ 18న నిర్వహించనున్నట్లు కమిటీ ప్రకటించింది.
హిమాచల్‌లో ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలపై వేటు:
హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ పఠానియా గురువారం తీర్పు వెలువరించారు. మొత్తం ఆరుగురు తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుధీర్ శర్మ (ధర్మశాల), రాజిందర్ రాణా (సుజన్‌పూర్), ఇందర్ దత్ లఖన్‌పాల్ (బర్సార్), రవి ఠాకూర్ (లాహౌల్ స్పితి), చైతన్య శర్మ (గాగ్రేట్), దేవిందర్ భుట్టో (కుట్లేహర్) సభ్యత్వం రద్దు చేయబడింది. పార్టీ విప్‌ను ఉల్లంఘించినందున, ఫిరాయింపుల నిరోధక చట్టం తనకు వర్తిస్తుందని, అందుకే ఆయన సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు స్పీకర్ కుల్దీప్ పఠానియా తెలిపారు.
సీఎం షిండే పేరిట నకిలీ సంతకం:
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేరు మీద నకిలీ సంతకాలు, స్టాంపులు వాడుతున్న ముఠాపై సోదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత కొద్ది రోజులుగా సీఎం పేరిట నకిలీ సంతకాలు, స్టాంపులతో కూడిన డజను మెమోరాండాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో జమ అయినట్లు సమాచారం. మెమోరాండం సమర్పించిన వారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ సాయం తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి సంతకంతో కూడిన ఒక డజను మెమోరాండంలు ముఖ్యమంత్రి కార్యాలయానికి అందాయి. తదుపరి చర్యలకు ఆదేశాలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఏక్నాథ్ షిండే అటువంటి మెమోరాండంపై సంతకం చేయలేదు.
ఛాయ్ వాలాతో బిల్ గేట్స్ జుగల్బందీ:
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ భారత్ పర్యటనకు వచ్చారు. భువనేశ్వర్‌లో బిల్‌గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరిశోధనా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్లింది. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన నాగ్‌పూర్ చాయ్ వాలా డాలీ దగ్గరకు వెళ్లారు బిల్ గేట్స్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిల్ గేట్స్ ‘వన్ చాయ్ ప్లీజ్’ అంటూ టీ అడిగాడు. ఇక్కడి టీ రుచిని ఆస్వాదిస్తూ మైమరిచిపోయారు.
ఎట్టకేలకు ఓటీటీలోకి హిట్ మూవీ:
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో నటించాడు. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పటికి సినిమాకు క్రేజ్ తగ్గలేదు. కాగా గత ఐదేళ్లు క్రితం సంతానం నటించి హిట్ మూవీ ఏ1. తమిళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఏ1 చిత్రం చూడాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. రెంటల్ విధానంలో తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మీరు చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రూ.79 చెల్లించాల్సిందని తెలుస్తుంది.