Leading News Portal in Telugu

చేగొండి రాజకీయం ఇదీ!.. వైసీపీ గూటికి సూర్యప్రకాశ్ | chegondi harirama jogayya son join ycp| covert| janasena| tdp| alliance| spoil| plot| fail| open| letter| pawan


posted on Mar 1, 2024 2:58PM

మాజీ మంత్రి, కాపు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య పవన్ కల్యాణ్ కు విరామం లేకుండా లేఖలు రాస్తూనే ఉన్నారు. తాను జనసేన బాగు కోరేవాడినని చెప్పుకుంటూనే ఉన్నారు. నోటితో పలుకరించి నొసటితో వెక్కిరిస్తున్నట్లుగా ఆయన ఓ వైపు జనసేన బలం గురించి గొప్పలు చెబుతూ మరో వైపు ఆయన కుమారుడిని వైసీపీలోకి పంపిస్తున్నారు. ఈ రోజు ఆయన తాను వైసీపీ కోవర్టుని ఎలా అయ్యానో చెప్పాలని జనసేనానికి ఓ లేఖ రాశారు.

ఆ తరువాత కొద్ది సేపటికే ఆయన కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్ జగన్ తో భేటీకి తాడేపల్లి ప్యాలెస్ చేరుకున్నారు. ఇప్పటి వరకూ జనసేనలో క్రియా శీల సభ్యుడిగా ఉన్న సూర్య ప్రకాశ్ ఇహనో, ఇప్పుడో వైసీసీ తీర్ధం తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ పరిణామం ద్వారా హరిరామ జోగయ్య వైసీపీ కోవర్ట్  ఎలా అయ్యారో పవన్ కల్యాణ్ వివరించి చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరికీ తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభలో పవన్ కల్యాణ్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకుండానే తనకు సలహాలూ సూచనలూ అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఎవరు ఏ ఉద్దేశంతో  అవి ఇస్తున్నారో తనకు తెలుసుననీ, తన మాటకు విలువనిచ్చి తనతో నడిచే వారే తనవారని కుండ బద్దలు కొట్టేశారు.

దీంతో అప్పటి వరకూ జనసేనానిపై పొత్తు పొడవాలంటే అధిక స్థానాల కోసం డిమాండ్ చేయాలి, లేదా రెండేళ్లు సీఎం పదవి కోసం పట్టుబట్టాలి అంటూ ఒత్తిడి తీసుకువచ్చేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమయ్యాయి. దీంతో ఓ వైపు తమ మాట వినలేదని సన్నాయి నొక్కులు నొక్కుతూనే బహిరంగ లేఖల ద్వారా తాము ఏ ప్రయోజనం ఆశించి జనసేనానిపై ఎక్కువ స్థానాలు, పదవి కోసం ఒత్తిడి తేవడానికి ప్రయత్నించామో చెప్పకనే చెప్పేస్తున్నారు. హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం ఇరువురూ కూడా కాపు సామాజిక వర్గ శ్రేయోభిలాషులం అన్న ముసుగు మాటున జనసేన, తెలుగుదేశం పొత్తు పొడవకుండా ఉండేందుకు తమ స్థాయికి మించిన ప్రయత్నాలే చేశారనీ, అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటువంటి ఒత్తిడులకూ లొంగకుండా, మీ సలహాలు అవసరం లేదనడం ద్వారా వారిని దూరం పెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దీంతో ఇక ముసుగులు తీసేసి ఇప్పటి వరకూ తాను ఎవరి కోసమైతే జనసేన ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయాలంటూ వచ్చారో, వారితోనే కలిసేందుకు రెడీ అయిపోయారని చేగొండి సూర్యప్రకాశ్ పవన్ తో భేటీని ఉదాహరణగా చూపుతున్నారు. 

జనసేన రాజకీయ వ్యవహారాల కమాటీ సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్య ప్రకాశ్ ఆ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకూ ఆయన ఆచంట అసెంబ్లీ నియోజకవర్గ జనసేన ఇన్ చార్జిగా కూడా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన జనసేనకు రాజీనామా చేసి తాడేపల్లి ప్యాలెస్ తలుపుతట్టారు. జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీ అభ్యర్థిగా ఆచంట లేదా నిడదవోలు నుంచి టికెట్ అడుగుతున్నారు. అయితే వైసీపీ నుంచి ఆయనకు పాలకొల్లు టికెట్ ఆఫర్ చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడం లాంఛనమేనని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. అంతే కాకుండా చేగొండి సూర్యప్రకాశ్ జనసేనను వీడి వైసీపీ గూటికి చేరడం అన్నది ఇప్పటికిప్పుడు చోటు చేసుకున్న పరిణామం కాదని కూడా అంటున్నారు.