Leading News Portal in Telugu

Delhi: రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరంగా ఏడీఆర్ నివేదిక



Dke

రాజ్యసభ ఎంపీలపై ఆసక్తికరమైన ఏడీఆర్ నివేదిక వెలువడింది. రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల్లో (Rajya Sabha MPs) 33 శాతం మందిపై క్రిమినల్ కేసులు(Criminal Cases) ఉన్నట్లు ఎన్నికల హక్కుల సంఘం ఏడీఆర్(ADR) నివేదిక తెలిపింది. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీల డేటాను విశ్లేషించిన తర్వాత ఏడీఆర్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సిట్టింగ్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.19,602గా ఉన్నాయని తెలిపింది.

ఇద్దరు ఎంపీలపై మాత్రం హత్య, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. 225 మంది రాజ్యసభ సిట్టింగ్ ఎంపీలలో 75 (33 శాతం) మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, 40 (18 శాతం) మంది తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు చెప్పారు. క్రిమినల్ కేసులున్న వారిలో బీజేపీ సభ్యులే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన 28 మంది ఎంపీలలో 50 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయి.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 13 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు (38 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురిలో నలుగురు (67 శాతం), సీపీఐ(ఎం) నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం) నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారు. ఆప్‌కి చెందిన 10 మంది ఎంపీలలో 30 శాతం మంది, వైఎస్సార్‌సీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో నలుగురు (36 శాతం), డీఎంకే 10 మంది ఎంపీల్లో ఇద్దరు (20 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్లు అఫిడవిట్‌లో సమర్పించారు.

ఇక ఎంపీల నేర చరిత్రతో పాటు రాజ్యసభ సభ్యుల ఆస్తులపై కూడా వెల్లడించింది. ఒక్కో ఎంపీకి సగటున రూ.87.12 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తేలింది. 90 మంది సభ్యులున్న బీజేపీకి చెందిన 9 మంది, కాంగ్రెస్‌ 4 మంది, వైసీపీ అయిదుగురు, ఆప్, బీఆర్ఎస్, ఆర్జేడీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు రూ.100 కోట్లకుపైనే ఆస్తులు కలిగి ఉన్నారు. పార్టీల వారీగా బీజేపీ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.3,360 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల మొత్తం ఆస్తులు రూ.1,139 కోట్లు, వైఎస్సార్‌సీపీ (YSRCP) ఎంపీల ఆస్తులు రూ.3,934 కోట్లు, బీఆర్ఎస్ (BRS) ఎంపీల ఆస్తులు రూ.5,534 కోట్లు, ఆప్ ఎంపీల ఆస్తులు రూ.1,148 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ఒక స్థానం, జమ్ము కశ్మీర్ నుంచి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ముగ్గురు ఎంపీల అఫిడవిట్‌లు అందుబాటులో లేకపోవడంతో ఏడీఆర్ వారి డేటాను విశ్లేషించలేదు.