Leading News Portal in Telugu

Himachal pradesh: సంక్షోభంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం.. మరో ఇద్దరు తిరుగుబాటు!



Cong

హిమాచల్‌ప్రదేశ్‌లో (Himachal pradesh) రాజకీయ సంక్షోభం మరింత పీక్ స్టేజ్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల ముందు ఊహించని పరిణామాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఘటనతో రాష్ట్ర కాంగ్రెస్‌తో పాటు అధిష్టానం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనంతరం మంత్రి విక్రమాదిత్య సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌ సింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. సుఖ్వీందర్ సింగ్ తీరు వల్లే ఎమ్మెల్యేలు క్రాస్‌కు ఓటింగ్‌కు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా.. సీఎంను మాత్రం మార్చలేదని వాపోయారు.

ఈ పరిణామాలతో అప్రమత్తమైన అధిష్టానం.. ఢిల్లీ నుంచి దూతలను పంపించింది. అక్కడ పరిణామాలను పరిశీలించిన తర్వాత ఆరుగురు రెబల్స్ ఎమ్మెల్యేలపై బహిష్కరణ వేటు వేశారు. అసెంబ్లీ స్పీకర్‌ కుల్దీప్‌సింగ్‌.. ఆరుగురిపై అనర్హత వేటు వేశారు. ఇంతటితో సమస్య పరిష్కారం అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.

ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్, విక్రమాదిత్య సింగ్ తల్లి ప్రతిభాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా సమస్య పోలేదని పేర్కొన్నారు. త్వరలోనే సోనియా, రాహుల్‌ను కలుస్తామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో చేయాల్సినవి చాలా ఉన్నాయని. పార్టీని పటిష్ఠం చేస్తేనే వచ్చే ఎన్నికలను ఎదుర్కోగలమని మొదటిరోజు నుంచి సీఎంకు చెబుతున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. కాంగ్రెస్ కంటే బీజేపీనే మెరుగ్గా ఉందని ఆమె పేర్కొన్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దామని మీడియాకు చెప్పుకొచ్చారు.

ఇకపోతే రెబల్స్ ఎమ్మెల్యేలతో విక్రమాదిత్య సింగ్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా చేరినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు ఈ పరిణామాలతో బీజేపీ కూడా అప్రమత్తమైంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు లేదని గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో ఉన్న 15 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసి.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది. అనర్హతపై బీజేపీ ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిణామాలను చూస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి గండం తప్పేటట్లు కనిపించడం లేదు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్‌కు 40, బీజేపీకి 25, స్వతంత్రులు ముగ్గురు ఉన్నారు. అయితే మంగళవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 34 ఓట్లు వచ్చాయి. దీంతో లాటరీ వేయడంతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. వాస్తవానికి కాంగ్రెస్ గెలవాల్సిన సీటు కమలం తన్నుకుపోయింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు బీజేపీకే ఓటు వేశారు. దీంతో హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. తాజాగా మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మరీ జరుగుతుందో వేచి చూడాలి.