Leading News Portal in Telugu

టిడిపిలో చేరిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 


posted on Mar 2, 2024 9:43AM

ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్న నేపథ్యంలో  వైసీపీ నుంచి టిడిపిలో చేరికలు పెరిగిపోతున్నాయి. మళ్లీ జగన్ ప్రభుత్వం  అధికారంలో రాదని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరూ తెలుగు దేశం పార్టీలో చేరుతున్నారు. తాజాగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఉదయం హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి కృష్ణప్రసాద్ చేరుకున్నారు. కృష్ణప్రసాద్ కు పార్టీ కండువా కప్పిన చంద్రబాబు… టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు, ఇటీవల కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వైసీపీపై, సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని అని చెప్పి మాట మార్చడం జగన్ కే చెల్లిందని అన్నారు. ప్రతిపక్ష నేతలను తిడితేనే వైసీపీలో పదవులు ఇస్తారని చెప్పారు. తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెపుతూనే చంద్రబాబును, లోకేశ్ ను వ్యక్తిగతంగా దూషించాలని చెప్పారని మండిపడ్డారు. వైసీపీలో ఉండలేకే టీడీపీలో చేరుతున్నానని చెప్పారు. దేవినేని ఉమతో తనకు వ్యక్తిగత ద్వేషాలు లేవని… ఇద్దరం కలిసి కూర్చొని అన్నీ మాట్లాడుకుంటామని తెలిపారు. మరోవైపు, మైలవరం ఎమ్మెల్యే టికెట్ ను దేవినేని ఉమకు కాకుండా వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు కేటాయించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.