posted on Mar 2, 2024 1:51PM
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మరో పది పదిహేను రోజులలోగానే వెలువడే అవకాశాలున్న నేపథ్యంలో కేంద్రంలో మళ్లీ సర్కార్ ఏర్పాటుపై బీజేపీలో కనిపిస్తున్న ధీమా, కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వస్తామన్న విషయంలో విపక్షాలలో కనిపించడం లేదు. నిజమే.. బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా పొత్తుల వైపుగా పడిన విపక్షాల అడుగులు ఆదిలోనే తడబడ్డాయి. ఎవరికి వారే యమునా తీరే చందంగా వాటి అడుగులు పడుతున్నాయి.
అయినా దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల కాలానికి కాలం చెల్లిందనే పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన మోడీ సర్కార్ పేరుకు మాత్రమే సంకీర్ణ ప్రభుత్వం. 2014లో విపక్షాలకు ఏదో మేరకు గౌరవ ప్రదమైన గుర్తింపు ఇచ్చినా.. క్రమంగా బీజేపీ తన పెద్దన్న పాత్రను పెంచుకుంటూ పోయింది. 2019 ఎన్నికల సమయానికి కేంద్రంలో ఉన్నది నామ్ కే వాస్తే ఎన్డీయే ప్రభుత్వంగా మారిపోయింది. 2019 ఎన్నికలలో బీజేపీ ఘన విజయం తరువాత కేంద్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. 2014 ఎన్నికల వేళ విపక్షాల ఐక్యతకు గండికొట్టే ప్రయత్నంగా మాత్రమే బీజేపీ పాత మిత్రులకు ఆహ్వానం పలుకుతోంది. కొత్త మిత్రులకు తలుపులు తెరుస్తున్నది. అయినా కూడా ఆ పార్టీ ప్రకటించుకుంటున్న లక్ష్యలను చూస్తే ఎన్డీయే కాదు బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మిత్ర పక్షాల పాత్ర ప్రభుత్వంలో నామమాత్రంగానే ఉంటుంది అని చెప్పకనే చెబుతున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే కేంద్రంలో ఆ పరిస్థితి ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఐక్యంగా అడుగులు వేయాల్సిన విపక్షాలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయి. నిజానికి దేశంలో ప్రతిపక్షాలకు అవకాశాలు క్షీణుస్తున్న దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయని గతంలోనే సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. ఆయన ఈ మాట సీజేఐ హోదాలోనే అన్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ లో ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ పని తీరు రోజురోజుకూ దిగజారిపోతోందని ఆయన నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
అవధులు లేని అధికారం కారణంగా ప్రభుత్వాలు ప్రజాస్వామ్య విలువల గురించి పట్టించుకోకుండా తమ మాటే నెగ్గాలన్న పట్టుదలతో ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఒక విధమైన అహంకారంలో వ్యవహరిస్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో తెలంగాణలో ప్రభుత్వ తీరును చూసినా, అలాగే జగన్ హయాంలో ఏపీలో పాలన సాగుతున్న తీరును చూసినా ఇది నిజమని ఎవరినా అంగీకరించే పరిస్థితులే ఉన్నాయి. అదే విధంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా అస్మదీయులు, తస్మదీయులన్న స్పష్టమైన వివక్షను చూపుతూనే పాలన సాగిస్తోందని పరిశీలకులు ఉదాహరణలతో సహితంగా వివరించి విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ ప్రత్యర్థులు, వ్యతిరేకుల లక్ష్యంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు, విమర్శలు ఇటీవలి కాలంలో పెచ్చరిల్లడమే ఇందుకు నిదర్శనం. అదే విధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాను ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలోనే రాజ్యసభ వేదికగా పలుమార్లు రాజకీయ వ్యవస్థ దిగజారిపోతోందన్న ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థల ప్రతిపక్షాలు బలహీనం కావడం అంటే ఆ వ్యవస్థ దిగజారడమే అవుతుందని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు. విపక్షాల బలహీనత కారణంగానే దేశంలో ప్రజాస్వామ్య విలువలూ రోజురోజుకూ దిగజారిపోతున్నాయన్నది కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. అయితే ఈ పరిస్థితి ఏర్పడడానికి అధికారంలో ఉన్న ప్రభుత్వాల తీరు ఎంత కారణమో, కేవలం అధికారమే పరమావధిగా, దేశ ప్రయోజనాలను పట్టించుకోకుండా, సర్దుబాట్లకు సిద్ధపడకుండా నాయకత్వ స్థానం కోసం పట్టుబడుతూ ఐక్యతకు బీటలు వారుస్తున్న విపక్షాల తీరు కూడా ఇందుకు కారణమేనని పరిశీలకులు అంటున్నారు. ఏది ఏమైనా దేశంలో ప్రస్తుత పరిస్థితికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా తయారైందని చెప్పక తప్పదని అంటున్నారు.