
సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీ బీజేపీ (AP BJP) సన్నద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక, పొత్తులపై బీజేపీ నేతలు చర్చలు ప్రారంభించారు. శని, ఆదివారాల్లో పార్టీ శ్రేణుల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శనివారం పలువురి నేతల అభిప్రాయాలను సేకరించారు. ఢిల్లీ నుంచి వచ్చిన జాతీయ సహా సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ (Sive prakash) అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా పలువురు పలు రకాలుగా తమ సూచనలు తెలియజేశారు.
ప్రధానంగా పొత్తులు లేకుండా పోటీ చేయగలమా..? లేదా..? అనే అంశంపై శివ ప్రకాష్ ఆరా తీసినట్లు తెలిసింది. పార్టీకి బలమున్న స్థానాలను ప్రత్యేకంగా రాసుకున్నారు. పొత్తులుంటే టీడీపీ-జనసేన పార్టీలు ముందుగానే సీట్లను ప్రకటించడమేంటి? అనే అంశాన్ని శివ ప్రకాష్ దగ్గర పలువురు నేతలు ప్రస్తావించారు.
పొత్తు లేకుండా పోటీ చేస్తే.. పోటీకే పరిమితం అవుతాం తప్పా.. గెలిచేది ఏమి ఉండదని మరికొందరు నేతలు అభిప్రాయపడ్డారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. పని చేస్తామని ఇంకొందరు నేతలు పేర్కొన్నారు. పొత్తుల విషయంలో జాప్యం చేయకుండా క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెజార్టీ నేతలు కోరినట్లు సమాచారం. ఇలా పలువురు పలు రకాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
విష్ణుకుమార్ రాజు…
శివ ప్రకాష్‌తో భేటీ తర్వాత ఆ పార్టీ సీనియర్ నేత విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉండాలనే ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేనతో పొత్తుకు వెళ్లడం వల్లే తాను విశాఖ నార్త్ నుంచి గెలిచినట్లు గుర్తుచేశారు. మళ్లీ విశాఖ నార్త్ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయినా పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్.. వాళ్లు చెప్పిందే పాటిస్తామని విష్ణుకుమార్ రాజు తేల్చిచెప్పారు.