
BJP: లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపీ తన అభ్యర్థుల మొదటి జాబితాను ఈ రోజు విడుదల చేసింది. మొత్తం 195 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో పాటు తొలి జాబితాలో పలువురు బీజేపీ టాప్ లీడర్లు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే విషయాన్ని ఆ పార్టీ ప్రకటించింది.
నరేంద్రమోడీ:
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేయబోతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఆయన అక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై, 2019లో సమాజ్‌వాదీ పార్టీ నేత షాలినీ యాదవ్‌పై ఆయన విజయం సాధించారు.
అమిత్ షా:
బీజేపీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న గుజరాత్ గాంధీ నగర్ స్థానం నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి బరిలోకి దిగబోతున్నారు.
రాజ్‌నాథ్ సింగ్:
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నుంచి పోటీలో ఉన్నారు.
స్మృతి ఇరానీ:
2019లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు. మరోసారి ఈ ఎంపీ స్థానం నుంచే పోటీలో ఉన్నారు.
జ్యోతిరాదిత్య సింధియా:
రాజ్యసభ ఎంపీ జ్యోతిరాదిత్య సింథియా ఈ సారి లోక్‌సభ బరిలో నిలిచారు. ఆయన మధ్యప్రదేశ్ గుణ నుంచి పోటీ చేయబోతున్నారు.
శివరాజ్ సింగ్ చౌహాన్:
గతేడాది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బీజేపీకి అఖండ విజయాన్ని అందించిన మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తొలిసారిగా పార్లమెంట్ బరిలో ఉన్నారు. ఆయన విదిషా నుంచి పోటీ చేయబోతున్నారు. చౌహాన్ సేవలని బీజేపీ కేంద్రంలో ఉపయోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
కిరణ్ రిజిజు:
ప్రస్తుతం ఎర్త్ సైన్సెస్ మంత్రిగా ఉన్న కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు.
రాజీవ్ చంద్రశేఖర్:
కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కేరళలోని తిరువనంతపురం నియోజవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ నేత శశిథరూర్‌కి చెందిన ఈ స్థానం నుంచి బీజేపీ రాజీవ్ చంద్రశేఖర్‌ని బరిలోకి దింపింది.
హేమా మాలిని:
నటి, రాజకీయ నాయకురాలు హేమామలిని మరోసారి మధుర నుంచి బరిలో ఉన్నారు. 2014, 2019లో వరసగా రెండు సార్లు ఆమె అక్కడ నుంచి గెలుపొందారు.
భూపేందర్ యాదవ్:
బీజేపీ కీలక నేత, రెండు దశాబ్ధాలుగా పార్టీ కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న భూపేందర్ యాదవ్ తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో అడుగుపెడుతున్నారు. ఈయన రాజస్థాన్ అల్వార్ నుంచి బీజేపీ బరిలో దింపింది.
మరికొందరు ప్రముఖులు:
ఓం బిర్లా-కోట(రాజస్థాన్)
సురేష్ గోపి- త్రిస్సూర్(కేరళ)
అనిల్ ఆంటోనీ- పత్తనంతిట్ట(కేరళ)
అర్జున్ మేఘ్వాల్-బికనీర్(రాజస్థాన్)
గజేంద్ర సింగ్ షెకావత్- జోధ్‌పూర్(రాజస్థాన్)
బిప్లవ్ దేవ్-త్రిపుర వెస్ట్
అజయ్ మిహ్రా తేని-లఖీమ్‌పూర్ ఖేరీ(ఉత్తర్ ప్రదేశ్)
సాక్షి మహారాజ్- ఉన్నావ్(ఉత్తర్ ప్రదేశ్)
రవి కిషన్-గోరఖ్ పూర్(ఉత్తర్ ప్రదేశ్)