Leading News Portal in Telugu

TDP: టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేశ్ కీలక ప్రకటన.. పోటీ నుంచి విత్‌డ్రా



Rajesh

టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అభ్యర్థులను ప్రకటించి వారం రోజులు కూడా గడవకముందే ఒక వికెట్ డౌన్ అయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం తెలుగు దేశం అభ్యర్థి మహాసేన రాజేశ్ (Mahasena rajesh) పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

ఇటీవలే చంద్రబాబు-పవన్ ‌కల్యాణ్ కలిసి టీడీపీ, జనసేన అభ్యర్థుల్ని ప్రకటించారు. టీడీపీ నుంచి పి.గన్నవరం అభ్యర్థిగా మహాసేన రాజేశ్‌కు అవకాశం కల్పించారు. కానీ స్థానిక టీడీపీ, జనసేన నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా పలు కుల సంఘాలు కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని తప్పుపట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

ఒక సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం ఏకమైందని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కులరక్కసి చేతిలో బలైపోయానని.. తన వల్ల పార్టీకి చెడ్డపేరు రావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాజేశ్ చెప్పుకొచ్చారు.

హిందువుల గురించి రాజేశ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, అతడిని తప్పించాలని విశ్వహిందూ పరిషత్, రామసేన, బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేపట్టాయి. జగన్మాత పార్వతీ దేవిని కించపరుస్తూ సోషల్ మీడియా వేదిక రాజేష్ ప్రచారం చేసినట్లు హిందూ సంఘాలు తప్పుపట్టాయి. సోషల్ మీడియా వేదికగా హిందూ సంఘాలు తప్పు పట్టడంతో.. వారి ఆందోళనలకు తలొగ్గి పోటీ నుంచి తప్పుకుంటున్నానని రాజేశ్ ప్రకటించారు.