Leading News Portal in Telugu

TSUTF : పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి



Tsutf

ఖజానా కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థిక శాఖ వద్ద రెండేళ్ళుగా పెండింగులో ఉన్న మెడికల్ రీయింబర్స్ మెంట్, జిపిఎఫ్, టిఎస్ జిఎల్ఐ, పిఆర్సీ, డిఎ బకాయిలు, సప్లిమెంటరీ జీతాలు, పెన్షన్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యుటిఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. టిఎస్ యుటిఎఫ్ ఆఫీస్ బేరర్స్ సమావేశం ఆదివారం రాష్ట్ర కార్యాలయంలో కె జంగయ్య అధ్యక్షతన జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి చెందిన బిల్లులు మంజూరు కాకపోవటం చేత ఈ ఆర్థిక సంవత్సరంలో గత ఏప్రిల్ తరువాత రీవాలిడేషన్ లేదా తిరిగి సమర్పించాల్సి వచ్చిందని, ఈ నెలాఖరులోగా మంజూరు కాకపోతే మరలా అదే పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని టిఎస్ యుటిఎఫ్ హెచ్చరించింది.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో పేర్కొన్న విధంగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్దరించాలని, మూడు వాయిదాల డిఎ బకాయిలు విడుదల చేయాలని, పదోన్నతులు, బదిలీలకు గల ఆటంకాల తొలగింపుకు చొరవతీసుకోవాలని టిఎస్ యుటిఎఫ్ కోరింది. ప్రభుత్వ స్థలాలు, సొమ్ముతో ప్రైవేటు యాజమాన్యంలో పబ్లిక్ పాఠశాలల ఏర్పాటు సరైంది కాదని ఇది విద్యా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని కనుక ఈ ఆలోచన విరమించుకోవాలని టిఎస్ యుటిఎఫ్ డిమాండ్ చేసింది. మోడల్ స్కూలు, గురుకుల ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నూతన నియామకాలకు ముందుగానే పూర్తి చేయాలని, ఆ ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని, కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని సమావేశం కోరింది. మెగా డియస్సీ ప్రకటన, విద్యాకమీషన్ ఏర్పాటు, జిఒ 317 సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం నియామకాన్ని టిఎస్ యుటిఎఫ్ ఆహ్వానించింది. మార్చి 9,10 తేదీల్లో హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్న టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ వార్షిక విస్తృత సమావేశాల్లో రాష్ట్ర విద్యారంగం అభివృద్ది పై విస్తృతంగా చర్చించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, సిహెచ్ దుర్గాభవాని, కోశాధికారి టి లక్ష్మారెడ్డి, కార్యదర్శులు కె సోమశేఖర్, ఎం రాజశేఖర్ రెడ్డి, ఎ వెంకట్, ఇ గాలయ్య, డి సత్యానంద్, జి నాగమణి, బి రాజు, ఎస్ మల్లారెడ్డి, కె రవికుమార్, ఎస్ రవిప్రసాద్ గౌడ్, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి, పి మాణిక్ రెడ్డి, మహబూబ్ అలీ పాల్గొన్నారు.