Leading News Portal in Telugu

వైసీపీ ఒక దొంగల ముఠా..ఇదిగో నిదర్శనం! | ycp bharat unveil smuggler veerappan memorial| sthupa| big


posted on Mar 5, 2024 9:03AM

వైసీపీ ఎమ్మెల్సీ భరత్ వ్యవహారశైలిపై ఆ పార్టీలోనే ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు.. తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం డెడ్ బాడిని డోర్ డెలివరీ చేసిన వ్యవహరంలో పార్టీ పరువు కాస్తా గోదాట్లో కలిసి పోయిందని.. తాజాగా మరో ఎమ్మెల్సీ భరత్..  తన వ్యవహార శైలితో.. పార్టీ పరువును కొండెక్కించేశారి వైసీపీలోని ఒక వర్గం మండిపడుతోంది.  

ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో అబకలదొడ్డి పంచాయతీ పరిధిలోని కాకర్లవంకలో స్థానికులు కొందరు గంధపు స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్తూపాన్ని నిర్మించారు. వీరప్పన్ ఫోటోతో పాటు జెండా ఏర్పాటు చేశారు. తాజాగా ఆ గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ భరత్ ఆ స్తూపాన్ని ఆవిష్కరించడమే కాకుండా.. నవ్వుతూ.. ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ చిత్ర రాజం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వ్యవహరం పట్ల ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం… కారాలు మిరియాలు నూరుతోంది. 

ఎందుకంటే.. ఇప్పటికే వైయస్ వివేకా హత్య కేసు.. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌తోపాటు ఆయన కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అలాంటి వేళ ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్   ప్రతిపక్ష పార్టీలకు ఓ ఆయుధంలా దొరికింది. ఇక ఇప్పుడు ఎమ్మెల్సీ భరత్.. గంధపు చక్కల స్మగర్ల వీరప్పున్‌ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించడం అంటే చేజేతులా పార్టీ జుట్టును విపక్షానికి అందజేయడమేనన్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.  

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అదీ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులంతా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ.. ఆచి తూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా ఎమ్మెల్పీ, అంతే కాకుండా వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబుకు ప్రత్యర్థిగా జగన్ నిర్ణయించిన అభ్యర్థి కూడా అయిన భరత్ హత్యలు, అరాచకాలతో నరరూపరాక్షసుడిగా ముద్రపడిన స్మగ్లర్ వీరప్పన్ స్మారక స్ఫూపాన్ని ఆవిష్కరించి పార్టీ ప్రతిష్టను పాతాళానికి దిగజార్చేశారని వైసీపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. 

 ఎమ్మెల్సీ భరత్‌ను రానున్న ఎన్నికల్లో కుప్పం ప్యాన్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం వైయస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు కుప్పంలో  నారా చంద్రబాబు నాయుడిని ఓడించి… భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకొని మంత్రి పదవి కట్టబెడతానంటూ జగన్ ప్రకటించారు. అలాంటిది అదే భరత్ ఇలా.. స్మగ్లర్ల వీరప్పన్ స్మారక చిహ్నం ఆవిష్కరించడం ద్వారా సమాజానికి ఏ  సందేశం ఇచ్చినట్లు అన్న ప్రశ్న వైసీపీ నుంచే ఎదురౌతోంది.    

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిపై ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్ బరిలో దిగనున్న సంగతి అందరికీ తెలిసిందేనని.. అలాంటి ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్న భరత్ ఇంత అడ్డగోలుగా, అరాచకంగా వ్యవహరిస్తే ఎలా అంటున్నారు. 

 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. పాలకుల తప్పులను ప్రజల మధ్యకు వెళ్లి ప్రశ్నించడమే ప్రతిపక్షాల ప్రధాన కర్తవ్యమనే విషయాన్ని సైతం మరచి.. పార్టీ ప్రజా ప్రతినిధులు ఇలా వ్యవహరించడం.. ఏ మాత్రం పద్దతిగా లేదని అంటున్నారు.

 

గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్.. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను గడగడలాడించాడని.. అలాగే అతడిని తొలి సారి అరెస్ట్ చేసిన వ్యక్తి పందిళ్లపల్లి శ్రీనివాస్ అని.. ఆయన రాజమండ్రి వాస్తవ్యుడని.. ఐఎఫ్ఎస్ అదికారిగా ఆయన కర్ణాటక కేడర్‌లో పని చేస్తుండే వారని.. 

అయితే తాను లొంగిపోతానని.. అయితే ఆయుధాలు లేకుండా అడవిలోకి రావాలంటూ.. శ్రీనివాస్‌కు స్మగ్లర్ వీరప్పున్ సమాచారం ఇవ్వడంతో   అది నిజమని నమ్మి… ఆయన ఓంటరిగా అడివిలోకి వెళ్లి.. వీరప్పన్ చేతిలో అత్యంత దారుణంగా హత్య కావింపబడ్డారని.. ఇక శ్రీనివాస్ ధైర్య సాహసాలకు మెచ్చిన భారత ప్రభుత్వం.. శ్రీనివాస్ మరణానంతరం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసిందని వారు గుర్తు చేస్తున్నారు.

అలాంటి నీతి నీజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఉన్నతాధికారి… అందునా తెలుగు వ్యక్తిని ఇంత అత్యంత పాశవికంగా స్మగ్లర్ వీరప్పన్ హత్య చేశారని.. అలాంటి నరహంతుకుడి స్మారక చిహ్నం ఆవిష్కరించడానికి ఎమ్మెల్సీ భరత్‌కు చేతులు ఎలా వచ్చాయని వైసీపీ నేతలే అంటున్నారు. ఏదీ ఏమైనా అవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అన్నట్లాగా వీరి వ్యవహారం ఉందని వైసీపీలోని ఒక వర్గం నిరసన వ్యక్తం చేస్తోంది.