Leading News Portal in Telugu

ప్రతి స్కీం ఓ స్కామ్.. సంక్షేమం పేరిటా అడ్డగోలు దోపిడీయే! | every scheme a scam| jagan| rule| robbery| name| welfare| win| doors


posted on Mar 5, 2024 10:20AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాలు తాడేపల్లి ప్యాలెస్ గడప దాటదు.. మాటలు మాత్రం లోకాన్ని చుట్టేస్తాయి. తాడేపల్లి ప్యాలెస్ గడప దాటాలంటే రోడ్లకిరువైపులా పరదాలు, రోడ్డు మార్గంలో కాకుండా కూతవేటు దూరానికి కూడా హెలికాప్టరే వాహనం. పొరపాటున రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వస్తే దారిలో రోడ్డుకిరువైపులా ఉన్న చెట్లను నరికేయాల్సిందే. అయితే ఇదంతా ఆయనలో  జనాలకు కనిపించడానికి ఉన్న భయాన్నే చాటుతున్నది. పొరపాటున తాను జనం కంట పడితే.. నిలదీస్తారన్న భయం. వాగ్దానాలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తారన్న జంకు. ఇటీవల ఆయన పులివెందుల పర్యటనలో అదే జరిగింది.

సొంత నియోజకవర్గమే కదా అనుకుంటే.. ఆయన కనిపించగానే జనం ఒక్క సారిగా సమస్యల చిట్టా విప్పారు. ఏం చేశారంటూ నిలదీశారు, వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో జగన్ తనకు అలవాటైన షిక్కటి షిరునవ్వును ముఖం మీద పులుముకుని నోరెత్తకుండా అక్కడ నుంచి జారుకున్నారు. బటన్ నొక్కుతున్నానంటూ ఈ ఐదేళ్లలో  అరకొరగా సంక్షేమం పేరిట నిధులు పందేరం చేసి జగన్ చేతులు దిలిపేసుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాల్లో 99 శాతం పైగా అమలు చేసేశామని ఘనంగా చాటుకుంటున్నారు. కానీ జనం మాత్రం అమలు చేసిన వాగ్దానాలు వాస్తవంగా చూస్తే ఒక శాతం కూడా పూర్తిగా ఉండవని లెక్కలతో సహా చెబుతున్నారు. ఈ విషయాలనే  ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు రచ్చబండ వేదికగా జగన్ ను ఉతికి ఆరేశారు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు పంచుతున్నామన్న పేరుతో కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు.  ఇలా జగన్ అమలు చేస్తున్న ప్రతి పథకంలోనూ లబ్ధిదారులకు అందేది స్వల్పమేననీ, దొడ్డిదారిన నొక్కేసేదే అధికమని ఆయన ఆరోపించారు. చివరకు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ సొమ్మును సైతం స్వాహా చేస్తున్నారని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. ఇలా నొక్కుసిన సొమ్మును ఆఫ్రికా దేశాలలో పెట్టుబడులుగా పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని విదేశీ ప్రతినిథి బృందాల ద్వారా తనకు తెలిసిందన్నారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి స్కీము ఒక స్కామేనని విమర్శించారు.  ఒకవైపు దేశ ప్రధానమంత్రి డిజిటలైజేషన్ దిశగా వెడుతుంటే.. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అందుకు భిన్నంగా నడుస్తున్నారన్నారు. వృద్ధులకు పింఛన్ నేరుగా అందించడం, మద్యం విక్రయాలలో నగదు లావాదేవీలకే పెద్ద పీట వేయడం వంటివి ఇందుకు ఉదాహరణగా ఆయన చూ పారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఏ ఒక్క పథకంలోనూ కూడా నగదు చెల్లింపులు లేవని గుర్తు చేసిన రఘురామకృష్ణం రాజు జగన్ మాత్రం నగదు చెల్లింపులకే మొగ్గు చూపడం వెనుక కారణం దోపిడీయేనని ఆరోపించారు.  అలా దోచిన సొమ్మును ఖర్చు పెట్టి ఎన్నికలలో గెలవాలన్నది జగన్ వ్యూహం, ఎత్తుగడ అని ఆయన విమర్శించారు. అయితే లక్ష కోట్లు ఖర్చు పెట్టినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదనీ, ఈ విషయాన్ని తాను కాదు.. గత ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియ అయిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే చెప్పారని అన్నారు.

 తెలుగుదేశం, జనసేన కూటమితో కలవవద్దని మొరపెట్టుకోవడానికే జగన్ హస్తిన వెళ్లాఅంటూ మోడీని ప్రాధేయపడడానికే హస్తినకు వెడుతున్నారనీ, అయితే అక్కడా ఆయనకు పరాభవం తప్పదని రఘురామ జోస్యం చెప్పారు. అసలు జగన్ కు మోడీ అప్పాయింట్ మెంట్ దొరికే అవకాశాలే లేవని అభిప్రాయపడ్డారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టేసిన జగన్ కు ఒక్క క్షణం కూడా సీఎంగా కొనసాగే అర్హత లేదన్నారు. సచివాలయం తాకట్టు విషయాన్ని తాను ప్రధాని మోడీకి లేఖ ద్వారా లెలియజేశానన్నారు. 

అయితే సెక్రటేరియట్   తాకట్టుకు ముందే   విశాఖపట్నంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, పార్కు, రైతు బజార్, డైరీ ఫార్మ్, వివిధ శాఖలకు చెందిన కార్యాలయాలను, ప్రభుత్వ స్థలాలను  జగన్ తాకట్టు పెట్టేశారని వివరించారు. ఆ తాకట్టు ద్వారా  25 వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టడానికి నేషనల్ బ్యాంకుల వద్దకు వెళితే ఛీ… పొమ్మన్నాయి కనుకే  ప్రైవేట్ బ్యాంకు లో తాకట్టు పెట్టారని చెప్పారు.  మొత్తంగా జగన్ సర్కార్ కు గెలుపుదారులన్నీ మూసుకుపోయాయని, అందుకే సొమ్ములు వెదజల్లి అయినా గెలవాలన్న నిర్ణయానికి వచ్చేశారనీ, తన మేనత్త విమలారెడ్డి ద్వారా పాస్టర్లను ప్రలోభ పెట్టి క్రిస్టియన్ ఓటర్లను తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారనీ, అయితే సొమ్ముదండుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వైసీపీ వాళ్లు పోస్టర్లకు ఇస్తానన్న సొమ్ము ఇవ్వకపోవడంతో వారూ తిరగబడ్డారనీ, విమలారెడ్డి దొడ్డిదారిన పలాయనం కావడానికి అదే కారణమని అంటున్నారు. మొత్తంగా జగన్ కు ఇప్పుడు ఏదీ కలిసిరావడం లేదనీ, గతంలో చేసిన తప్పులే ఇప్పుడు ఆయనను అధికారానికి దూరం చేయనున్నాయని పరిశీలకులు సైతం అంటున్నారు. మొత్తంగా జగన్ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులను సైతం వెతుక్కోవలసిన దయనీయ స్థితిలో ఉన్నారు.  టికెట్ ఇస్తామన్నా వద్దు మహప్రభో అంటూ దణ్ణం పెట్టి పారిపోతున్న వారి సంఖ్య వైసీపీలో రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తంగా పార్టీ అభ్యర్థులలోనే జగన్ ఫేస్ పెట్టుకుని వెడితో ఓటమి తథ్యమన్న భావన ఏర్పడింది.