Leading News Portal in Telugu

వైసీపీ కి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా 


posted on Mar 5, 2024 1:39PM

అధికార పక్షం వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటివరకు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా… తొలిసారి ఓ మంత్రి వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. 

వైసీపీ కి, మంత్రి పదవికి గుమ్మనూరు జయరాం ఎట్టకేలకు  రాజీనామా చేశారు.  12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోసిన గుమ్మనూరు  రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకసారి మంత్రి పదవి చేశారు.  ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానని రాజీనామా తర్వాత గుమ్మనూరు చెప్పారు.  చంద్రబాబు సమక్షంలో జయహో బీసీ సదస్సులో టీడీపీలో చేరుతున్నానని గుమ్మనూరి ప్రకటించారు. ఆలూరు నియోజకవర్గంలోనే ఉండాలని కోరుకున్నానని.. ఎంపీ పదవి వద్దన్నానని తెలిపారు.

మా నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నారని గుమ్మనూరు అన్నారు. మా కులం ఎక్కువగా రెండు జిల్లాల్లోనే ఉందని తెలిపారు. గుంతకల్ నుంచి పోటీ చేయడానికి తాను సుముఖంగా ఉన్నానన్నారు. తన సొంతూరు గుంతకల్ దగ్గర్లోనే ఉంది.. కాబట్టి తాను గుంతకల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానన్నారు. కర్ణాటకలో తన సోదరుడు మంత్రిగా ఉన్నారంతేనని.. తానేమీ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో లేనని తెలిపారు.

మంత్రి గుమ్మనూరు జయరాం నేడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు వివరించారు. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలో జరిగే ‘జయహో బీసీ’ సభా వేదికపై టీడీపీలో చేరతానని వెల్లడించారు. 

సీఎం జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి ఏం చెబితే జగన్ కు అదే వేదం అని అన్నారు.