మంగళగిరిలో లోకేష్ కు ఎదురేలేదు!.. వైసీపీకి అభ్యర్థులే దొరకడం లేదు! | lokesh josh in mangalagiri| jumpings| ycp| empty| candidate
posted on Mar 5, 2024 12:55PM
మంగళగిరి నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపైనే ఉంది. నిన్నటి వరకూ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ పరిస్థితి ఏమిటి? అన్నది పక్కన పెడితే మాత్రం ఇప్పుడు మాత్రం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం లోకేష్ కు కంచుకోట అన్న భావనే సర్వత్రా వ్యక్తం అవుతున్నది. ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ అంటే ఉమ్మడి రాష్ట్రంలో కలుపుకుని తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1985 తరువాత మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం గెలిచిన చరిత్రే లేదు. అటువంటి సేఫ్ నియోజకవర్గం కాని మంగళగిరి నుంచి లోకేష్ తొలి సారిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎన్నికల బరిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో లోకేష్ పరాజయం పాలైనా.. ఎటువంటి పరిస్థితులనైనా, పోటీనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమన్న విషయాన్ని చాటారు. పరాజయం పాలైనా నియోజకవర్గాన్ని వదలకుండా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరు సాగించారు. మరో సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడానికి రెడీ అయిపోయారు. మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం విజయాల హిస్టరీ చూస్తే అటువంటి నియోజకవర్గం నుంచి ఒకసారి ఓటమి పాలై మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటే ఎంతో సాహసం కావాలి. అంతకు మించి ధీమా ఉండాలి. ఆ రెండూ తనలో పుష్కలంగా ఉన్నాయని లోకేష్ చాటారు.
తగ్గేదేలే ఓడిన చోటనే మళ్ళీ గెలిచి తానేంటో నిరూపిస్తానంటూ ముందుకు అడుగేశారు. చరిత్రను తిరగరాసి తండ్రి చంద్రబాబుకు బహుమతి ఇస్తానంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది లోకేష్ మొండితనమా.. ధీమానా అంటే ఖచ్చితంగా గెలుపు ధీమానే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మంగళగిరిలో లోకేష్ విజయం సాధించడం గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు. గత ఐదేళ్లుగా నారా లోకేష్ ఇక్కడ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ఈసారి మంగళగిరిలో విన్నింగ్ గ్యారంటీ అని వినిపిస్తుంది.
లోకేష్ గెలుపు అవకాశాలను చూస్తే.. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి 2014, 2019లలో రెండు సార్లు ఇక్కడ నుంచి గెలిచారు. 2014లో జస్ట్ 12 ఓట్ల తేడాతో బయటపడిన ఆర్కే 2019లో నారా లోకేష్ పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అటువంటి ఆర్కే మంగళగిరిలో విజయం సాధించడం అసాధ్యమన్న అంచనాకు వచ్చిన వైసీపీ అధినేత జగన్ ఆయనను మార్చేసి లోకేష్ మీద బీసీ నేత గంజి చిరంజీవిని నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. దీనితో అలిగిన ఆర్కే వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరి.. మళ్లీ ఓ పది రోజుల్లోనే తిరిగి వెనక్కు వచ్చేశారు. అదంతా వేరే కథ. లోకేష్ ఓటమే లక్ష్యంగా జగన్ మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ గంజికి కూడా ఇక్కడ విజయం సాధించేంత సీన్ లేదని భావించి మరో అభ్యర్థిని రంగంలోకి దింపారు. చివరకు ఆమెను కూడా మారుస్తారేమో తెలియదు. అధికారంలో ఉండి కూడా లోకేష్ కు దీటైన అభ్యర్థిని ఎంపిక చేయడం విషయంలో జగన్ మల్లగుల్లాలు పడుతున్నారంటేనే మంగళగిరిలో లోకేష్ సాధించిన పట్టు ఏమిటన్నది అవగతమౌతోంది. అలాంటి పట్టు సాధించడం కోసం లోకేష్ కూడా గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకూ ప్రతి నాయకుడిని వ్యక్తిగతంగా కలిసి దగ్గరయ్యారు. ఇవన్నీ చూస్తుంటే ఈసారి లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకే అన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచే కాదు, సామాన్య జనం నుంచీ, పరిశీలకుల నుంచీ కూడా వ్యక్తమౌతోంది.
పరిశీలకులైతే మంగళగిరిలో వైసీపీ అడ్రస్ గల్లంతేనని విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా వైసీపీ మంగళగిరిలో రెండు నెలల వ్యవధిలో ఇద్దరు అభ్యర్థులను మార్చడమే అంటున్నారు. ఎంతగా ప్రయత్నిస్తున్నా నియోజకవర్గ వైసీనీరెండు నెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపి నుంచి వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గంలో భారీ స్పందన లభిస్తోంది. వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు కూడా పెద్దఎత్తున తెలుగుదేశంలో చేరుతున్నారు. చేరుతున్నారు. జగన్ నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన వైసిపి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం బాట పడుతున్నారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసిపి కుటుంబాలు యువనేత లోకేష్ సమక్షంలో తెలుగుదేశం కండువాలు కప్పుకున్నారు.
తాడేపల్లి పట్టణానికి చెందిన నాయకులు ఎస్.రామశంకర్, బి.రవికుమార్ తో సహా 20 మంది, ఉండవల్లి గ్రామానికి చెందిన శింగంశెట్టి తేజోధర్, ఉప్పు సుబ్బారావు(నాని)తో సహా 20 మంది, దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామానికి చెందిన సుమారు 100 కుటుంబాలు నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరారు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామం నుంచి అనంత్ నెమలికంటితో సహా నలుగురు నాయకులు, శ్రీకృష్ణ లెనిన్, గుమ్మడి గోపి, వలపర్ల రామారావు, కనపర్తి హరి , మల్లవరపు మాణిక్యాల రావు, ఆరుమల్ల సుబ్బారావు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. అలాగే కుంచనపల్లి గ్రామం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు తెలుగుదేశం గూటికి చేరారు. ఇలా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వైసీపీనీ వీడి తెలుగుదేశం గూటికి చేరుతున్న వారి సంఖ్య జాతరను తలపించేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంగళగిరిలో పరిస్థితిని చూస్తే లోకేష్ అత్యధిక మెజారిటీ సాధించి విజయంలో చరిత్ర తిరగరాయడం ఖాయమని అంటున్నారు.