
నైరోబీ నేషనల్ పార్క్ పైన రెండు విమానాలు (Plane Collision) ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారని కెన్యా పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఓ శిక్షణ విమానం నేల కూలి ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. సఫారీలింక్ ఏవియేషన్ (Safarilink Aviation)కు చెందిన ఫ్లైట్ ఐదుగురు సిబ్బంది సహా 44 మందితో మంగళవారం ఉదయం నైరోబీలోని విల్సన్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. అప్పటికే అక్కడినుంచి బయల్దేరిన ఓ చిన్నపాటి శిక్షణ విమానం గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో నైరోబీ జాతీయ పార్కు గగనతలంలో ఉన్న శిక్షణ విమానాన్ని మరొకటి వచ్చి ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు.
దీంతో చిన్న విమానం నేలకూలగా.. అందులోని ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు చెప్పారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే భారీ శబ్దం వినిపించింది. దీంతో సిబ్బంది వెంటనే ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించి, సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సఫారీలింక్ ఏవియేషన్ తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.