Leading News Portal in Telugu

Gummanur Jayaram: కేబినెట్‌ నుంచి గుమ్మనూరు జయరాం బర్తరఫ్



Jayaram

Gummanur Jayaram: జయహో బీసీ సభ వేదికగా తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వేటు వేసింది అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేశారు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన జయరాం.. ఆ వెంటనే సాయంత్రం టీడీపీలో చేరారు. ఇక, ఆలస్యం చేయకుండా వెంటనే ఆయనపై చర్చలకు దిగారు సీఎం జగన్.. గుమ్మనూరు జయరాంను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సిఫార్సు చేశారు సీఎం జగన్‌.. ఇక, సీఎం నిర్ణయానికి ఆమోదించిన గవర్నర్.. ఈ మేరకు గెజిట్‌ విడుదల చేశారు.. దీంతో.. గుమ్మనూరు జయరాం కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయినట్టు అయ్యింది.

Read Also: UPSC Recruitment: గుడ్‌న్యూస్.. 1,930 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..

కాగా, అధికార వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై చెప్పగా.. తొలిసారి ఈ రోజు ఓ మంత్రి వైసీపీకి రాజీనామా చేశారు.. మంత్రి గుమ్మనూరు జయరాం ఈ రోజు.. మంత్రి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విషయం విదితమే.. ఎమ్మెల్యేగానూ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం పేర్కొన్నారు.. సీఎం వైఎస్‌ జగన్ అనుసరిస్తున్న విధానాలు తమకు నచ్చలేదని.. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారని, మందిరంలో శిల్పం లాగా జగన్ తయారయ్యారని పరోక్ష విమర్శలు గుప్పించిన విషయం విదితమే.. ఆ తర్వాత మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు గుమ్మనూరు జయరాం.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు.. బడుగులకు స్వతంత్రం రావాలి.. టిక్కెట్లు బడుగులకిచ్చి.. అగ్ర కులాలకు ఇంఛార్జీలను ఇస్తే స్వతంత్రం ఉంటుందా..? అని టీడీపీ చేరిన తర్వాత వ్యాఖ్యానించారు మంత్రి గుమ్మనూరు జయరాం.