
Iran: ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఇటీవల కాలంలో ఉరిశిక్షలను విధించడం ఎక్కువ చేసింది. ఇస్లామిక్ చట్టాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ఇరాన్ మరణశిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది ఏకంగా 834 మందికి మరణశిక్ష విధించిందని, 2015 తర్వాత ఇదే అత్యధికమని హక్కుల సంఘాలు మంగళవారం తెలిపాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇరాన్ ఉరిశిక్షల సంఖ్య 2022 నాటికి 43 శాతం పెరిగింది.
2015లో 972 ఉరిశిక్షల విధింపు తర్వాత రెండు దశాబ్ధాల్లో ఇలా 800 మరణశిక్షల విధింపు ఇది రెండోసారి మాత్రమే అని నార్వేకు చెందిన ఇరాన్ మానవహక్కులు(ఐహెచ్ఆర్), పారిస్‌కి చెంది టుగెదర్ ఎగైనెస్ట్ ది డెత్ పెనాల్టీ సంయుక్త నివేదిక పేర్కొంది. 2022లో మహ్సా అమిని మరణం తర్వాత ఇరాన్ వ్యాప్తంగా మహిళలు హిజాబ్‌కి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సమాజంలో భయాన్ని పెంపొందించేందుకు అక్కడి మతతత్వ ప్రభుత్వం మరణశిక్షలను సాధనంగా ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సామాజిక భయం కలిగించడం అనేది అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఏకైక మార్గం, మరణశిక్షలు ఇందుకు ముఖ్యమైన సాధనంగా ఉపయోగిపడుతున్నాయిన ఐహెచ్ఆర్ డైరెక్టర్ మహమూద్ అమిరీ-మొగద్దమ్ అన్నారు.
Read Also: Viral News: ఏడాదికి ఒకేసారి స్నానం.. అయినా వారి నుంచి సుగంధ వాసన
2022 నిరసనల సందర్భంగా భద్రతా బలగాలపై దాడులు చేసిన కేసుల్లో ఇరాన్ 9 మంది వ్యక్తులను ఉరితీసింది, 2022లో ఇద్దరు, 2023లో ఆరుగురు, 2024లో ఇప్పటి వరకు ఒక్కరిని ఉరితీసినట్లు హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. 2023లో మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఉరిశిక్షల సంఖ్య పెరిగింది. 471 మందికి మరణశిక్ష విధించింది. 2020తో పోలిస్తే ఇది 18 రెట్లు ఎక్కువ. ఇరాన్ మైనారిటీల్లోని సున్నీ బలూచ్‌లు ఎక్కువగా ఈ ఆరోపణలతో ఉరితీయబడ్డారు. మరోవైపు బహిరంగంగా ఉరితీయబడిన వారి సంఖ్య 2022లో పోలిస్తే 2023లో మూడు రెట్టు పెరిగింది. ఏడుగురిని బహిరంగ ప్రదేశాల్లో ఉరితీశారు. 22 మంది మహిళలకు మరణశిక్ష విధించినట్లు నివేదిక పేర్కొంది.
2022లో మహ్సా అమిని అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదనే ఆరోపణలతో అక్కడి మోరాలిటీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కొట్టడంతో మరణించింది. ఆ తర్వాత ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున ఉద్యమించింది. హిజాబ్ తీసేసి, జట్టు కత్తిరించుకుని మహిాళలు నిరసన తెలిపారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ప్రజలకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. భద్రతా బలగాల్లో పలువురు మరణించారు.