
బెంగళూర్లో దారుణం జరిగింది. పెళ్లి రోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కోపంతో ఓ మహిళ నిద్రిస్తున్న భర్తను కత్తితో పొడిచింది. ఈ సంఘటన ఫిబ్రవరి 27 తెల్లవారుజామున జరిగింది. 35 ఏళ్ల మహిళ, 37 ఏళ్ల తన భర్తపై దాడి చేసింది. వెంటనే తేరుకున్న అతను భార్యను పక్కకు నెట్టేయడంతో బతికిపోయాడు. గాయాలతో ఉన్న అతను ఆస్పత్రికి వెళ్లేందుకు పొరుగువారి సాయం తీసుకున్నాడు. మెడికో లీగల్ కేసు కావడంతో వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
Read Also: Atchannaidu: నేనేం తప్పు చేశాను.. ఎందుకు జైల్లో పెట్టారు.. అవినీతి చేశానని నిరూపిస్తే తల తీసేసుకోవడానికి సిద్ధం..!
మార్చి 1న సదరు మహిళపై కేసు నమోదు చేయబడింది. ఇది కుటుంబ సమస్య కావడంతో వారిద్దరు చర్చించుకుని, సమస్యను పరిష్కరించుకోవడానికి దంపతులకు సమయం ఇచ్చామని సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. తన తాత మరణించడంతో వివాహ వార్షికోత్సవానికి భార్య కోసం గిఫ్ట్ కొనుగోలు చేయలేదని ప్రాథమిక విచారణలో తేలింది. అతను తన భార్యకు బహుమతి ఇవ్వకపోవడం ఇదే తొలిసారి కావడంతో ఆమె కలత చెందిందని అధికారులు చెప్పారు. తన భార్య కొన్ని వ్యక్తిగత సమస్యలతో బాధపడుతోందని, ఆమెకు కౌన్సిలింగ్ చేయమని చెప్పాడని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.