Leading News Portal in Telugu

పల్నాడు జిల్లాలో తొలి సహస్ర లింగం! | first sahasralingam in palnadu| 4th| century| monument


posted on Mar 6, 2024 12:35PM

-పల్నాడు జిల్లా చేజర్లలో క్రీ.శ. 4వ శతాబ్ది సహస్ర లింగం!!

 -చేజర్లలో 1600 సం|| నాటి తొలి సహస్ర లింగం!!

– ఆనంద గోత్రికుల కాలంనాటిదంటున్న శివనాగిరెడ్డి

పల్నాడు జిల్లా,  నకరికల్లు మండలం, చేజర్ల కపోతేశ్వరాలయ ప్రాంగణంలోనున్న పల్నాటి సున్నపురాతిలో చెక్కిన శివలింగమే మన దేశపు తొలి సహస్ర లింగమని, పురావస్తు పరిశోధకుడు , ప్లీచ్ ఇండియా, సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గల సహస్ర లింగాలపై ప్రత్యేక పరిశోధన చేస్తున్న ఆయన, ఇటీవల చేజర్ల కపోతేశ్వరాలయంలోని సహస్ర లింగాలను అధ్యయనం చేస్తుండగా, ఆరడుగుల ఎత్తుతో పల్నాడు సున్నపురాతిలో చెక్కిన శివలింగంపై, 25 నిలువు వరుసలున్నాయని, ఒక్కో వరుసలో 40 చిన్న శివలింగాల చొప్పున మొత్తం వెయ్యి శివలింగాలున్నాయని, అసలు శివ లింగంతో కలిపితే ఆ రాతిపై 1001 శివలింగాలున్నాయని, ఈ శివలింగాన్ని ఏకోత్తర సహస్ర లింగ మంటారని, సర్వం శివమయం అన్న భావనకు ఇది తొలి ప్రతీక అని ఆయన అన్నారు.

 ప్రతిమా లక్షణాన్ని, ఇంకా పల్నాటి సున్నపురాతిపై చెక్కటాన్ని అనుసరించి, ఈ సహస్ర లింగం, కపోతపురమని పిలవబడిన చేజర్ల రాజధానిగా, ఉమ్మడి గుంటూరు మండలాన్ని పాలించిన శైవమతాభిమానులైన ఆనంద గోత్రిన రాజవంశీకుల (క్రీ.శ. 4వ శతాబ్ది) కాలానికి చెందిందని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని పరశురామేశ్వరాలయంలోనున్న క్రీ.శ. 7వ శతాబ్దం నాటి సహస్ర లింగమే, అత్యంత ప్రాచీనమైనదని చరిత్రకారులు భావిస్తున్న నేపథ్యంలో, కేంద్ర పురావస్తు శాఖ, అమరావతి సర్కిల్ పరిధిలోనున్న చేజర్ల సహస్ర లింగం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకొందని అన్నారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా, దేశంలోనే తొలిదైన ఈ సహస్ర లింగాన్ని సందర్శించి తరించాలని పల్నాడు జిల్లా ప్రజలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.