Leading News Portal in Telugu

Off The Record : T-Congress అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందా? లిస్ట్లో ఎవరున్నారు?



Tcongress Otr

అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ కాంగ్రెస్ కసరత్తు కొలిక్కి వచ్చిందా? ఫస్ట్‌ లిస్ట్‌లో ఎన్నిపేర్లు ప్రకటించే అవకాశం ఉంది? ఏయే స్థానాలకు ఎవరెవరు ఖరారయ్యారు? అసలు లిస్ట్‌ ప్రకటన ఎప్పుడు ఉండవచ్చు? పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ ఏం తేల్చబోతోంది? పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు మెల్లగా అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు విడతల వారీగా పేర్లను వెల్లడిస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై చాలా రోజులుగా కసరత్తు చేస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమీక్షలో పది నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎంపికపై కసరత్తు ముగిసింది. సెంట్రల్‌ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించాక ఫస్ట్‌ లిస్ట్‌లో పది మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. పీసీసీ చీఫ్‌ హోదాలో రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఆ సమావేశానికి హాజరు కాబోతున్నారు. చాంతాడంత ఉన్న ఆశావహుల లిస్ట్‌ నుంచి వడపోత తర్వాత అభ్యర్థుల్ని ఫైనల్‌ చేయబోతోంది అధిష్టానం. ఇప్పటి వరకు జరిగిన స్క్రీనింగ్‌ కమిటీ మీటింగ్స్‌లో కొలిక్కి వచ్చిన జాబితాకు.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఆమోద ముద్ర వేయించాలని భావిస్తోంది పార్టీ నాయకత్వం. దాని ప్రకారం చేవెళ్ల నుంచి జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతా మహేందర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టేనంటున్నారు. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డితో పాటు బాల్కొండ నుండి పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇద్దరిలో జీవన్ రెడ్డికే ఎక్కువ మార్కులు పడుతున్నాయట. ఇక నల్గొండ సీటుకు పార్టీ నాయకత్వం జానారెడ్డి పేరును సూచిస్తోంది. ఆయన మాత్రం తన కొడుకు రఘువీర్ రెడ్డి పేరు ప్రతిపాదిస్తున్నారు. కరీంనగర్‌లో ప్రవీణ్ రెడ్డి, వెలిశాల రాజేందర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

 

ఇద్దరిలో ప్రవీణ్ రెడ్డికి లైన్‌ క్లియర్ అవ్వ వచ్చంటున్నారు. ఇక మహబూబ్ నగర్ సీటు వంశీ చంద్ రెడ్డిదే. పెద్దపల్లికి వివేక్ కుమారుడు గడ్డం వంశీ పేరు ఖరారైంది. మరోవైపు యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి వరప్రసాద్ కూడా సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సికింద్రాబాద్ సీటుకు.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌, లేదంటే ఆయన భార్య శ్రీదేవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కుల సమీకరణలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. శ్రీదేవిది యాదవ సామాజిక వర్గం కాగా రామ్మోహన్ మున్నూరు కాపు . ఆ కుటుంబానికి ఇస్తే… రెండు సామాజిక వర్గాల బలం కలిసి వస్తుందని అంచనా వేస్తోంది పార్టీ. దీనికి తోడు మహిళా కోటాలో సీటు ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా ఉందట. కోటా ఏదైనా… లెక్క ఎలా ఉన్నా…సికింద్రాబాద్‌ టిక్కెట్‌ మాత్రం బొంతు ఫ్యామిలీకి ఫిక్స్‌. ఇక జహీరాబాద్ సీటు సురేష్ షెట్కార్‌కి ఖాయం. నాగర్‌కర్నూల్‌ కోసం మల్లు రవి, సంపత్ కుమార్ మధ్య పోటీ నడుస్తోంది. మల్లు రవి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేని కలిశారు. భువనగిరి పార్లమెంట్ విషయంలో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆ సీటు మాదేనంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. తన సన్నిహితుడు చామల కిరణ్ కోసం రేవంత్ పట్టుపడుతున్నారు. దీనిపై పీట ముడి కొనసాగుతోంది. వరంగల్ సీటు విషయంలో దొమ్మాట సాంబయ్య…ఇందిర మధ్య పోటీ ఉంది. ఇలా పది సీట్లపై క్లారిటీ తీసుకుని ప్రకటిస్తారన్న టాక్‌ నడుస్తోంది కాంగ్రెస్‌ వర్గాల్లో.