
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ (Rahul gandhi) ప్రసంగాలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సూచన చేసింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించింది.
ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని రాహుల్‌కు ఈసీ స్పష్టం చేసింది. ప్రధాని మోడీని ఉద్దేశించి గతంలో పనౌతి, పిక్ పాకెట్ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ ఈ సూచనలు చేసిందని తెలుస్తోంది. అలాగే ఎన్నికల ప్రచారంలో నేతలు, స్టార్ క్యాంపెయినర్లు వ్యవహరించాల్సిన తీరుపై జారీ చేసిన అడ్వైజరీని అనుసరించాలని సూచించింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీని ఉద్దేశించి వివిధ సందర్భాల్లో పనౌతి, పిక్ పాకెట్ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై గతేడాది నవంబర్ 23న ఈసీ నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు సైతం రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నోటీసులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈనేపథ్యంలో ఈసీ తాజాగా సూచనలు చేసింది.
ప్రజాక్షేత్రంలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని, భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొంది. గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు ఎన్నికల నియామవళి ఉల్లంఘనకు మళ్లీ పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది.